Cyclone In AP: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో భారీ వర్షాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు, తిరుమల శ్రీవారి మెట్టుమార్గం మూసివేత
నెల్లూరు (Nellore) జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది.
Nellore, OCT 17: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం (Vayugundam) గురువారం తెల్లవారు జామున తీరం దాటింది. నెల్లూరు (Nellore) జిల్లా తడ సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన ఆరు గంటలుగా 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరాన్ని తాకింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడుతుంది. తీరందాటే సమయంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లు.. గరిష్ఠంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం వరకు పోర్టులకు మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్నం పోర్టులకు ఒకటో నంబర్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ (IMD) చేసింది. వాయుగుండం తీరం దాటడంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rains in AP
వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు (Heavy Rains in AP) కురుస్తున్నాయి. అయితే.. ఇవాళ అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమూ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 8గంటల వరకు అత్యధికంగా తిరుపతి జిల్లా ఏర్పేడులో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో బుధవారం కుంభవృష్టి కురిసింది. కొండపై చలి తీవ్రత పెరిగింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి నుంచి తిరుమల కొండపైకి చేరుకొనే రెండు ఘాట్ రోడ్లలోని (Tirumala Ghat Road) మూడు ప్రదేశాల్లో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షపు నీటిలో బాగా నానిపోయిన కొండచరియలు 15వ కిలోమీటరు, హరిణి ప్రాంతం, భాష్యకార్ల సన్నిధి ప్రాంతాల్లో పడ్డాయి. టీటీడీ (TTD) సిబ్బంది అప్రమత్తమైన వాటిని వెంటనే తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో పాప వినాశనం, శ్రీవారి పాదాల మెట్టు మార్గాలు మూసివేశారు. అదేవిధంగా.. తిరుమలకు నడిచివచ్చే మార్గాల్లో ఒకటైన శ్రీవారి మెట్టు మార్గాన్ని గురువారం కూడా మూసిఉంచనున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు అధికంగా కురిసిన నేపథ్యంలో ఆ మార్గంలో వరద నీరు అధికంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో గురువారం ఒక్కరోజు మె మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.