Assam-Mizoram Border Dispute: అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం ఏమిటి? సమస్య ఎప్పటి నుంచి రగులుతోంది, 5 గురు అస్సాం పోలీసులు మృతితో మళ్లీ అక్కడ సమస్య తీవ్రరూపం, అస్సాం-మిజోరం సరిహద్దు వివాదంపై ప్రత్యేక కథనం
సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించారు. ఈ ఘటన అక్కడ మరింతగా ఉద్రిక్తతలను పెంచింది. ఈ సమస్య ఎప్పటి నుంచో అక్కడ రగులుతూ ఉన్నప్పటికీ పాలకులు దీనికి సరైన పరిష్కారం చూపలేకపోవడంతో అది రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
Cachar, July 27: ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దు ఇప్పుడు దాడులతో (Assam-Mizoram Border Dispute) అట్టుడుకుతోంది. సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించారు. ఈ ఘటన అక్కడ మరింతగా ఉద్రిక్తతలను పెంచింది. సోమవా రం జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతిచెందారని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ వెల్లడించారు. కచార్ ఎస్పీ నిబంల్కర్ వైభవ్ చంద్రకాంత్ సహా 50 మంది పోలీసులు గాయపడ్డారు.
ఇది సంఘవిద్రోహక శక్తుల పనేనని అసోం పోలీసులు చెబుతుండగా.. నిరాయుధులైన పౌరులపై అసోం పోలీసులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణకు తప్పనిసరి పరిస్థితుల్లో తమవాళ్లూ ఎదురు కాల్పులకు దిగారని మిజోరం హోం మంత్రి లాల్‌చమిలియానా పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య కచార్(అసోం), కొలాసిబ్(మిజోరం) జిల్లాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి. పక్షం రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలున్నాయి. మరోవైపు 200 మందికి పైగా అసోం పోలీసులు సీఆర్పీఎఫ్ పోస్టును దాటుకుని వచ్చి వైరెంగ్టే-లైలాపూర్ మధ్యలో పౌరులపై లాఠీలతో విరుచుకుపడ్డాని, దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారని మిజోరం సీఎం జోరామ్‌థాంగ్ ట్వీట్ చేశారు. ఓ జంట ప్రయాణిస్తున్న కారుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్విటర్ వేదికగా వాగ్యుద్ధానికి దిగారు.
అమిత్‌షా గారూ.. చూస్తున్నారు కదా? మీరు కల్పించుకుని, ఉద్రిక్తతలను నిలిపివేయండి’’ అని మిజోరం సీఎం జోరామ్‌థాంగా ట్వీట్ చేశారు. సరిహద్దుల్లో పరిస్థితిపై అమిత్‌షాను ట్యాగ్ చేస్తూ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. దీనిపై అసోం సీఎం హిమంత బిస్వ శర్మ తీవ్రంగా స్పందించారు. ‘‘జోరామ్‌థాంగ్ గారు.. కోలాసిబ్(మిజోరం) ఎస్పీ మా పోలీసు పోస్టుల్ని తొలగించాలంటున్నారు. లేదంటే మీ పౌరులు మాట వినరని, హింసను తాము ఆపలేమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వా న్ని ఎలా నడుపుతాం? మీరు త్వరగా కల్పించుకోండి’’ అని రీట్వీట్ చేశారు.
ఆ వెంటనే జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు చనిపోయిన విషయాన్ని ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇరు రాష్ట్రాల సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తతను అదుపు చేసి, శాంతి నెలకొల్పాలని సూచించారు.
ఈ సమస్య ఎప్పటి నుంచో అక్కడ రగులుతూ ఉన్నప్పటికీ పాలకులు దీనికి సరైన పరిష్కారం చూపలేకపోవడంతో అది రావణకాష్టంలా రగులుతూనే ఉంది. గతేడాది కూడా ఇక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తాజాగా పోలీసులపై జరిగిన దాడులతో ఇది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. అసలెందుకు ఇక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు మూలాలు ఏంటి (What Is Assam-Mizoram Border Dispute) ఎప్పటి నుంచి ఈ సమస్య రగులుతోంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యకు బీజం 19వ శతాబ్దంలోనే పడింది. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషర్లు (British Colonial Era) ఈశాన్య భారతంలోకి అడుగుపెట్టేందుకు అస్సాంను తమ ప్రధాన స్థావరంగా చేసుకున్నారు. అక్కడి నుంచి చుట్టుపక్కల ఆదివాసీల ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ప్రయత్నించారు. అప్పుడు అస్సాంలో చాలా భూభాగం ఉండేది. కాల క్రమంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత అస్సాం నుంచి నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లు వేరుపడ్డాయి. అయితే అలా వేరుపడినప్పుడు పాలకులు సరిహద్దులు నిర్ణయించలేదు. అదే ఇప్పుడు అక్కడ ఘర్షణలకు కారణమవుతోంది.
తమకు చెందాల్సిన ఎన్నో ముఖ్యమైన భూభాగాలు అస్సాంలోకి వెళ్లిపోయాయని మిజోరంతోపాటు నాగాలాడ్, మేఘాలయ రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే మిజోరం సరిహద్దులోనే కాదు అస్సాంలో నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోనూ అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు రాజుకుంటూనే ఉంటాయి. ఇప్పటికే ఎన్నో సరిహద్దు కమిషన్లను ఏర్పాటు చేసినా.. వాటి సిఫార్సులను ఈ రాష్ట్రాలు అంగీకరించకపోవడంతో అవి వృథాగానే మిగిలిపోయాయి.
1972లో మిజోరంను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత 1987లో దీన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు దీనిని లూషాయి హిల్స్‌గా పిలిచేవారు. ప్రస్తుతం ఈ హిల్స్‌ను మీజో హిల్స్ అంటున్నారు. మిజోరం రాష్ట్రంలో ఉన్న ఈ కొండలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నాయి. బ్రిటీషర్లు తేయాకు పండించడానికి అస్సాంలోని దక్షిణ ప్రాంతంలోని కాచర్ జిల్లాకు వెళ్లిన సమయంలో అక్కడి మీజో ఆదివాసీలతో ఘర్షణ తలెత్తింది. తమ లూషాయి హిల్స్ కోసం బ్రిటీషర్లతో యుద్ధానికీ దిగడంతో హింస జరిగింది. ఆ తర్వాత బ్రిటీషర్లు మీజో ఆదివాసీ పెద్దలతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ ఆదివాసీ ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా ఉండేందుకు రక్షణగా 1875లో ఓ ఇన్నర్ లైన్‌ను బ్రిటీషర్లు ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఈ లూషాయి హిల్స్ మిజోరంకే దక్కుతాయి. అప్పుడు బ్రిటీషర్లు గీసిన సరిహద్దే సరైనదని, దానినే అధికారికంగా గుర్తించాలని గతంలో మిజోరం అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. అయితే 1933లో ఈశాన్య భారతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న సమయంలో బ్రిటీషర్లు మిజోరం మ్యాప్‌ను మళ్లీ మార్చారు. ఈసారి అక్కడి మీజో పెద్దలను సంప్రదించకుండా ఏకపక్షంగా ఇది జరిగిందని, దీనిని అంగీకరించబోమని మిజోరం చెబుతోంది. 1875 డీమార్కేషన్‌నే కొనసాగించాలని వాదిస్తోంది.
1970ల నుంచే సరిహద్దు సమస్యతో అస్సాం, మిజోరం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. గతేడాది 2020లో ఇవి మరింత పెద్దవిగా మారాయి. నిన్న ఐదుగురు పోలీసులు మృతి చెందడటంతో ఈ సమస్య అక్కడ మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. మొన్నటి ఎన్నికల్లో మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాలను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తుందా లేదా రెండు రాష్ట్రాలు అంగీకరించేలా మరో సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేస్తుందా అన్నది చూడాలి.