New Delhi, July 6: దేశంలో ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు (Centre Appoints 8 New Governors) నియమితులయ్యారు. కొంతమందికి స్థానం చలనం కల్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేసింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు ( Kambhampati Hari Babu Mizoram) నియమితులయ్యారు. హిమాచల్ నుంచి హర్యానాకు దత్తాత్రేయ (Dattatreya Haryana) బదిలీ అయ్యారు.
కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లాట్(ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు), గోవా గవర్నర్‌గా శ్రీధరన్ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్), హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్రన్ విశ్వనాథ్‌ను కేంద్రం ప్రకటించింది. మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్ పటేల్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్‌గా రమేష్ బయాస్ నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముందే కేంద్రం.. గవర్నర్ల నియామకాలను జరిపింది. రేపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉంది.
కంభంపాటి హరిబాబు (Kambhampati Hari) విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వైజాగ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మను ఓడించిన ఘనతకు కంభంపాటి హరిబాబుకు ఉంది. ఆయనను గవర్నర్‌గా నియమించడం పట్ల ఏపీ బీజేపీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో బండారు దత్తాత్రేయను రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న హర్యానాకు బదిలీ చేయడాన్ని ప్రమోషన్ కల్పించినట్లుగా భావిస్తోన్నారు.
ఇక కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కొత్తగా 22 మందికి కేంద్ర కేబినెట్‌లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 53 మందితోనే కేంద్ర కేబినెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగతా 28 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇండోర్ నుంచి ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా, జనతాదళ్ నేత సీపీ సింగ్ సైతం దేశ రాజధానికి చేరుకున్నారని సమాచారం. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ సాయంత్రం ముఖ్యమైన కేబినెట్ మంత్రులతో, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశం అవుతారని వార్తలు రాగా.. ఆ తర్వాత సమావేశం రద్దు అయ్యింది. కాగా ప్రధాని మోదీ తొలిసారిగా కేబినెట్‌ను విస్తరిస్తున్నారు.