New Delhi, July 5: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ (India, Information Technology Act) చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఓ కేసు విచారణ సందర్భంగా ఐటీ చట్టంలో సెక్షన్ 66ఏను (Section 66A) రద్దు చేస్తున్నట్లు 2015 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించింది. దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ పోలీసు సిబ్బందికి సమాచారమివ్వాలని 2019లోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇంకా పలు చోట్ల పోలీసులు సెక్షన్ 66ఏ కింద కేసులు నమోదు చేస్తుండటంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ సెక్షన్ కింద గత ఆరేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైనే కేసులు నమోదయ్యాయని, దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఎన్జీవో అభ్యర్థించింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం తప్పకుండా నోటీసులు జారీ చేస్తాం అని పేర్కొంది.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇది చాలా దిగ్భ్రాంతికరం. దారుణమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి’’ అని పేర్కొంది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఐటీయాక్ట్‌లోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు. ఈ సవరణ చట్టానికి 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు మనోభావాల్ని, అభిప్రాయాల్ని సాధారణంగా వ్యక్తం చేసినా అరెస్ట్‌లు చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
అయితే 2012లో ముంబైలో ఇద్దరు యువతుల అరెస్ట్ ఈ అంశంపై విస్తృత చర్చకు దారితీసింది. 2012లో శివసేన చీఫ్ బాల్ థాకరే మరణం తర్వాత ముంబై బంద్ పాటించడాన్ని తప్పుబడుతూ.. పాల్‌గఢ్‌కు చెందిన ఓ అమ్మాయి పోస్ట్ చేయగా, దానికి మరో యువతి లైక్ కొట్టింది. దీంతో ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగంలో పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రాణ రక్షణకు, సమానత్వానికి హామీ ఇస్తున్న 14, 19, 21 అధికరణాలకు 66 (ఎ) సెక్షన్ భంగకరంగా ఉందంటూ 21 ఏళ్ల ఢిల్లీ న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘల్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పౌరుల భావ ప్రకటనను నిరోధించే ఐటీ చట్టంలోని సెక్షన్ 66 A, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.