New Delhi, july 5: కరోనా నుంచి బయటపడడానికి ‘వ్యాక్సినేషన్’ ఏకైక మార్గమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి నుంచి తాము దేశంలో డిజిటల్ వ్యూహాన్ని అనుసరించాలనే తాము వ్యూహం పన్నామని అన్నారు. సోమవారం ‘కొవిన్ అంతర్జాతీయ సదస్సులో (CoWIN Global Conclave 2021) ప్రధాని మోదీ ప్రసంగించారు. కోవిడ్‌పై పోరాటంలో టెక్నాలజీ కూడా సహకరించిందని, అదృష్టవశాత్తు సాఫ్ట్‌వేర్‌లో ఎటువంటి అవరోధాలు లేవని, అందుకే కోవిడ్ ట్రేసింగ్, ట్రాకింగ్ యాప్‌ను ఓపెన్ సోర్సుగా మార్చినట్లు ప్రధాని మోదీ (PM Narendra Modi Addresses CoWin Global Conclave) అన్నారు.
ఇతర దేశాలకు కోవిన్ పోర్టల్ సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉంటుందన్నారు. కోవిన్ యాప్‌తో వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ సాధించినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడేందుకు వ్యాక్సినేషన్ విధానం ఒక్కటే మానవళికి ఆశాకిరణం అన్నారు. అన్ని దేశాల్లోనూ కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. గత వందేళ్లలో ఇలాంటి మహమ్మారిని చూడలేదన్నారు. ఏ దేశమైనా, అది ఎంత శక్తివంతమైనదైనా, ఇలాంటి సమస్యను పరిష్కరించం అసాధ్యమన్నారు.
ఆరోగ్య సేతను యాప్ సక్సెస్ అయ్యిందని, 20 కోట్ల మంది ఆ యాప్‌ను వాడుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భారతీయ నాగరికత చూస్తుందని, మహమ్మారి వేళ ఈ తత్వాన్ని అందరూ అర్థం చేసుకున్నారని, అందుకే కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం రూపొందించిన కోవిన్ టెక్నాలజీ ఫ్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా చేసినట్లు ప్రధాని తెలిపారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు భారత్ వినియోగిస్తున్న డిజిటల్ వేదికే కొవిన్. కరోనాపై పోరులో భాగంగా ఈ ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ను దాదాపు 50 దేశాలకు ఉచితంగా అందించేందుకు భారత్ సిద్ధమైంది. దేశ విదేశాలకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకున్నారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్న విధానాన్ని భారతీయులు గట్టిగా విశ్వసిస్తారని, మహమ్మారి తర్వాత చాలా మంది విదేశీయులు కూడా ప్రస్తుతం ఈ సూత్రాన్ని బలంగా విశ్వసిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. వందేళ్లలో ఇంత పెద్ద మహమ్మారి ఏదీ లేదని, కరోనాకు దేశ, విదేశం అన్న తేడా లేదని మోదీ పేర్కొన్నారు.