Kamrup, May 2: ఈశాన్య రాష్ట్రం అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో (Assam Assembly Election Results 2021) బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ (NDA) వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో 74 సీట్లు గెలుచుకుంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎన్డీఏకు స్వల్పంగా సీట్లు తగ్గాయి. ఈసారి బీజేపీ (BJP) 59 స్థానాల్లో విజయం సాధించగా, మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ 9 చోట్ల, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 6 సీట్లలో గెలుపొందాయి.
సీఎం సర్బానంద సోనోవాల్, వైద్య మంత్రి హిమంతా బిశ్వాస్ శర్మ (Himanta Biswa Sarma), ఏజీపీ చీఫ్, మంత్రి అతుల్ బోరా వరుసగా మజులీ, జాలుక్‌బరి, బోకాఖాట్ నియోజకవర్గాల నుంచి ఘన విజయం సాధించారు.మంత్రి హిమంతా బిశ్వా శర్మ లక్ష ఓట్ల మెజారిటీ సాధించారు. ఆయనకు ఇది వరుసగా ఐదో గెలుపు. పటచార్‌కుచి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అస్సాం శాఖ అధ్యక్షుడు రంజీత్ దాస్... ఏజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పబీంద్ర దేకాపై గెలిచారు.
కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాకూటమి 52 సీట్లకే పరిమితమై మరోసారి అధికారానికి దూరమైంది. కాంగ్రెస్ 30 సీట్లను గెలుచుకోగా మహాకూటమిలోని మిగతా పార్టీలైన ఏఐయూడీఎఫ్ 16 సీట్లలో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో, సీపీఎం ఒక చోట గెలిచాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రిపుణ్ బోరా తన పదవికి రాజీనామా చేశారు.
2016లో అసోంలో (Assam) తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. 126 స్థానాలకు గాను 60 చోట్ల కాషాయ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అప్పటి దాకా అసోంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ 26 స్థానాలకే పరిమితమైంది. మెజారిటీ మార్కు సీట్లు రాకపోవడంతో ఏజీపీ, బీపీఎ్‌ఫలతో కలిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ముందు బీపీఎఫ్ ఎన్డీయే నుంచి వైదొలిగింది. ఇక కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌లతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది.
అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. అసోంలో గెలుపులో బీజేపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్ర్రమాలే బీజేపి గెలిచిపించాయని కేంద్రమంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం సర్బానంద సోనోవాల్‌తో పాటు అసోం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.