Rahul Gandhi: అప్పుడు తాను వ్యతిరేకించిన చట్టం ప్రకారమే రాహుల్ గాంధీపై అనర్హత వేటు, వైరల్ అవుతున్న 2013 నాటి రాహుల్ వీడియో
రాహుల్ ఆ సమయంలో అలా చేసి ఉండకపోతే బహుశా ఇప్పుడు అనర్హత వేటు ఎదుర్కొనే వాడు కాదేమో అంటున్నారు. ఏ చట్టాన్నైతే అప్పుడు చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారని దుయ్యబడుతున్నారు.
New Delhi, March 24: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మీద 8 ఏళ్ల అనర్హత వేటు పడడంపై 2013లో జరిగిన ఒక సంఘటనను నెటిజెన్లు గుర్తు చేస్తున్నారు. రాహుల్ ఆ సమయంలో అలా చేసి ఉండకపోతే బహుశా ఇప్పుడు అనర్హత వేటు ఎదుర్కొనే వాడు కాదేమో అంటున్నారు. ఏ చట్టాన్నైతే అప్పుడు చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారని దుయ్యబడుతున్నారు. విషయమేంటంటే.. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) సవరణకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్సులో కోర్టు శిక్ష పడ్డ నేతలకు అనర్హత వేటు నుంచి ఊరట లభిస్తుంది. అయితే ఆ సమయంలో ఆ ఆర్డినెన్సులు మీడియా సమక్షంలో రాహుల్ గాంధీ చించేశారు. దీంతో అది అక్కడే ఆగిపోయింది.
సరిగ్గా పదేళ్లకు అదే చట్టానికి రాహుల్ ఇప్పుడు బలయ్యారు. ఆ చట్టం ప్రకారం ఆయన మీద ఎనిమిది ఏళ్ల పాటు అనర్హత వేటు విధిస్తున్నట్లు లోక్‌సభ సెక్రెటేరియట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. “కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఆర్టికల్ 102(1)(ఇ)లోని నిబంధనల ప్రకారం ఆయన దోషిగా తేలినందున, 23 మార్చి 2023 నుంసీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యాకగ. భారత రాజ్యాంగం ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం చర్యలు తీసుకోబడ్డాయి” అని లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
మోదీలంతా దొంగలే అంటూ 2019 నాటి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన సూరత్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే ఇలా జైలు శిక్ష ఎదుర్కొన్న నేతల మీద ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అనర్హత వేటు వేయవచ్చు. దాని ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది.