Convicted Representatives In India (PIC @ PTI, Wikimedia commons)

New Delhi, March 24: మోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) లోక్‭సభ సెక్రెటేరియట్ అనర్హత వేటు వేయడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. అప్పీల్‭కు వెళ్లే అవకాశమున్నప్పటికీ సూరత్ కోర్టు ఆదేశాలను అవకాశంగా తీసుకుని కక్షపూరితంగా అనర్హత వేటు వేశారంటూ కాంగ్రెస్‭తో పాటు విపక్షాలు బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అయితే రాహుల్ మీద అనర్హత వేటుతో ఒక్కసారిగా అనర్హత వేటు గురించి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ కంటే ముందు దేశంలో కొంత మంది ప్రముఖులు సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు.

Rahul Gandhi's Disqualification As MP: రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అసలు మోదీ ఇంటిపేరు వివాదం ఏమిటీ, పరువు నష్టం దావా ఎవరు వేశారు, రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ ఏమన్నారు ? 

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మాజీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ స్వయానా నాయనమ్మ అయిన ఇందిరా గాంధీ (Indira Gandhi) సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు. 1975లో ఆమె తన లోక్‭సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయం చెల్లదని జూన్ 12, 1975న, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్‌మోహన్‌లాల్ సిన్హా ప్రకటించారు. ఎన్నికల దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు గాను ఆమెపై ఈ వేటు విధించారు. ఇక ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత (Jayalalitha), లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) లాంటి వారు కూడా ఉన్నారు. కాగా.. ఎవరెవరు ఎప్పుడు ఎందుకు అనర్హత వేటు ఎదుర్కొన్నారో చూద్దాం.

Rahul Gandhi's Disqualification: ఈ రోజు భారత ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే, రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ 

జయలలిత (Jayalalitha) – ఆదాయానికి మించి ఆస్తులు కలిగినందుకు గాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మీద 2017లో 4 ఏళ్ల పాటు జైలు శిక్షతో పాటు అనర్హత వేటు వేశారు. దీంతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించారు. ఆ సమయంలో ఆమె ఆర్.కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav) – దాణా కుంభకోణం కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‭ మీద 2013లో ఐదేళ్లపాటు జైలు శిక్షతో పాటు అనర్హత వేటు విధించారు. అప్పుడు ఆయన బిహార్ రాష్ట్రంలోని సరన్ లోక్‭సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కమల్ కిశోర్ భగత్ – మర్డర్ కేసులో కోర్టు దోషిగా తేల్చడంతో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నేత కమల్ కిశోర్ భగత్ మీద 2015లో అనర్హత వేటు పడింది. ఆయన జర్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగ అసెంబ్లీ నియోజకవర్గ సభ్యుడుగా ఉన్నారు.

సురేశ్ హల్వాంకర్ – మహారాష్ట్రలోని ఉచల్కారంజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సురేశ్ హల్వాంకర్ మీద 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు అనర్హత వేటు వేశారు. దొంగతనం కేసులో ఆయనకు ఈ వేటు పడింది.

టీ.ఎం సెల్వగనపతి – డీఎంకేకు చెందిన టీ.ఎం సెల్వగనపతి.. 2014లో రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో స్మశాన వాటిక కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు అనర్హత వేటు ఎదుర్కొన్నారు.

బాబన్‭రావు ఘోలప్ – శివసేకు చెందిన బాబన్‭రావు ఘోలప్.. మహారాష్ట్రలోని డియోలాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం అనర్హత వేటు వేశారు.

ఎనోస్ ఎక్కా – ఖార్జండ్‭కు చెందిన ఎనోస్ ఎక్కా.. 2013లో ఒక సీరియస్ కేసులో ఆయన మీద అనర్హత వేటు వేడయంతో పాటు జీవిత ఖైదు విదించారు.

ఆశా రాణి – మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బిజావర్ నుంచి బీజేపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన ఆశా రాణి మీద పనిమనిషిని ఆత్మహత్య చేసిన కేసులో 2013లో దోషిగా తేలడంతో అనర్హత వేటు వేశారు.

రషీద్ మసూద్ – ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ ఎంపీ పని చేసిన రషీద్ మసూద్.. 2013లో ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో 4 ఏళ్ల జైలు శిక్షతో పాటు అనర్హత వేటు ఎదుర్కొన్నారు.

జగదీష్ శర్మ – బిహార్ రాష్ట్రంలోని జహానాబాద్ లోక్‭సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న జేడీయూ నేత జగదీష్ శర్మకు 2013లో దాణా కుంభకోణం కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. అనంతరం ఆయనను ఎన్నికల పోటీకి అనర్హుడిగా ప్రకటించారు.

పప్పు కలాని – మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన పప్పు కలాని, 2013లో ఒక కేసులో దోషిగా తేలడంతో అనర్హత వేటు పడింది.