High Court of Telangana | (Photo-ANI)

Hyd, August 24: గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నుంచి భారీ షాక్‌ తలిగింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారంటూ గురువారం ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అదే సమయంలో.. ఎన్నికల్లో తర్వాతి మెజార్టీతో ఉన్న డీకే అరుణను(ప్రస్తుతం బీజేపీ) ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్‌రెడ్డికి 3 లక్షల జరిమానా విధించిన ధర్మాసనం అందులోంచి రూ.50 వేలు డీకే అరుణకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా ఈ మధ్యే కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు పడగా, ఆయన స్థానంలో జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం, కీలక వివరాలు ఇవిగో..

ప్రజాప్రతినిధుల అనర్హత కేసులన్నింటినీ ఈ నెలాఖారులోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ మధ్య అనర్హత పిటిషన్లపై విచారణ జరుపుతోంది. మంత్రుల కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కేసులతో పాటు పాతిక ఎమ్మెల్యేలు ఇలా అనర్హత వేటు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇందులో 90 శాతం పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఆ జాబితాను పరిశీలిస్తే..

అనర్హత కేసుల్లో.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, దేవరకొండ ఎమ్మెల్యే ఆర్‌ రవీంద్రకుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌లతో పాటు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్‌, ధర్మపురి కొప్పుల ఈశ్వర్‌, హుస్నాబాద్ సతీశ్‌, మహబూబ్ నగర్ శ్రీనివాస్‌రెడ్డి, నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్‌, కొడంగల్ పట్నం నరేందర్‌రెడ్డి, ఆసిఫాబాద్ ఆత్రం సక్కు, సికింద్రాబాద్ పద్మారావు, ఖైరతాబాద్ దానం నాగేందర్‌, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ ఈస్ట్ నరేందర్‌, జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్‌, మల్కాజిగిరి మైనంపల్లి హన్మంత్‌, వికారాబాద్ మెతుకు ఆనంద్‌, నాంపల్లి జాఫర్ హుస్సేన్‌, పటాన్ చెరువు మహిపాల్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిటిషన్లు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లుగా సమాచారం.