Manohar Lal Khattar: ఎమ్‌ఎస్‌పీ ఎప్పటికీ రద్దు కాదు, రద్దు చేయాలని చూస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా, చర్చలతోనే సమస్యకు పరిష్కారం, సంచలన వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాక్ ఖట్టర్
నిరసనలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్‌లాక్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్‌ఎస్‌పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్ ఆదివారం మాట్లాడారు.
Chandigarh, December 21: ఢిల్లీ సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతుల ఉద్యమిస్తున్న సంగతి విదితమే. నిరసనలు 26వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్‌లాక్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పంటలకు కల్పించే కనీస మద్ధతు ధరను(ఎమ్‌ఎస్‌పీ) ఎవరైనా రద్దు చేయాలని చూస్తే తను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఖట్టర్ ఆదివారం మాట్లాడారు.
‘రైతులకు కనీస మద్దతు ధర ఎప్పటికీ ఉంటుంది. దానిని ఎవరైనా తొలగించాలని చూస్తే మనోహర్‌లాల్ ఖట్టర్ రాజకీయాల నుంచి తప్పుకుంటాడు. ఎమ్‌ఎస్‌పీ ఎప్పటికీ రద్దు కాదు. ఎమ్‌ఎస్‌పీ గతంలో ఉంది. ఇప్పుడు ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది’ అని పేర్కొన్నారు. శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిసిన మరునాడు ఖట్టర్ ఈ ప్రకటన చేశారు.
చర్చల వల్లనే ఈ సమస్య (అన్నదాతల ఆందోళనలు ) పరిష్కారం అవుతుంది. త్వరలోనే ఈ సమస్య సమిసిపోతుందని భావిస్తున్నా. నూతన చట్టాలపై రైతులతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.’ అని కేంద్రమంత్రితో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య మరో రౌండ్ చర్చలు జరపవచ్చని ఖట్టర్ పేర్కొన్నారు,
కొత్త మూడు వ్యవసాయ చట్టాలపై తమ భయాలను మరింత వివరంగా చెప్పాలని నిరసన తెలుపుతున్న వ్యవసాయ సంఘాలను తోమర్ కోరారు. నిర్దిష్ట సమస్యలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇది అవసరమని, వారి ఆందోళనలో స్పష్టత లేదన్నారు. అదే విధంగా చర్చలకు ఓ తేదీని పేర్కొనాలని మంత్రి రైతులను కోరారు.
మరోవైపు ఒకట్రెండు రోజుల్లో రైతుల నిరసన బృందాలతో తోమర్ చర్చలు జరిపే అవకాశం ఉందని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. "ఎప్పుడు జరుగుతుందో సరిగా తెలియదు కాని త్వరలోనే నిరసనకారుల డిమాండ్లను చర్చించడానికి తోమర్ రైతుల ప్రతినిధులను కలుసుకునే అవకాశం ఉంది" అని షా ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని విలేకరుల సమావేశంలో అన్నారు.
ఇప్పటికే మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)ను కల్పించకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హెచ్చరించారు. శుక్రవారం చండీఘడ్‌లో జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) నాయకుడు మాట్లాడుతూ.. ‘‘మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పటికే ఎమ్‌ఎస్‌పీని కల్పించమని కేంద్రానికి లేఖ రాశారు. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం రైతులకు ఎంఎస్‌పీ ఉండేలా కృషి చేస్తాను. ఒకవేళ అలా జరగకుంటే రాజీనామా చేస్తాను’’అని చెప్పారు.
ఎంఎస్‌పీ, ఇతర డిమాండ్లపై రైతులకు లిఖితపూర్వక హామీలు ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చినందున అన్నదాతలు తమ ఆందోళనను విరమించుకుంటారని దుష్యంత్ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపే రైతులు కేంద్రం రాతపూర్వక హామీ ఇస్తున్నప్పుడు, అది “వారి పోరాటానికి విజయం” అని చౌతాలా అన్నారు.
అయితే, ఎంఎస్‌పి, మండి వ్యవస్థపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో నిరసనను కొనసాగించారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు, కొంతమంది హర్యానా రైతుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న దుష్యంత్ చౌతాలా, కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) వ్యవస్థకు ముప్పు ఉంటే తాను రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు.