Andhra Pradesh: భూముల దొంగ ఎవరు అని బొత్స అంటే సుజనా ఉలిక్కి పడ్డారా? పార్టీలు మారినంత మాత్రాన పాపాలు చెరిగిపోవు! ఏపీలో హీట్ పెంచుతున్న రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు. చంద్రబాబు, సుజనాల భూముల వివరాలు ప్రకటన.

అప్పటి చంద్రబాబు ప్రభుత్వం GO MS No 207, సెప్టెంబర్ 22, 2015 తేదీ మీద ఎకరం కేవలం రూ. 1 లక్షకే ఆ భూములను ధారాదత్తం చేసినట్లుగా బొత్స సత్యనారాయణ....

Amaravathi:  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో అనేక భూఅక్రమాలు, కుంభకోణాలు జరిగాయని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారయణ (Botsa Satyanarayana) వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గత చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొంతమంది చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీలు మారిన వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఆయన సీరియస్ అయ్యారు. గత వారం రోజులుగా రాజధాని మార్పు, భూకుంభకోణాల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఆరోపణ ప్రత్యారోపణలు చోటుచేసుకుంటున్నాయి.

ఏపీ సచివాలయంలో ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి భూముల విషయంలో రివర్స్ టెండరింగ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉంది. ఒక మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత ఎంపీకి చాలా ఎకరాల భూములు ఉన్నాయి అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బొత్స వ్యాఖ్యలకు కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి (Yalamanchili Satyanarayana Chowdary) స్పందించారు. అమరావతిలో తనకు ఒక ఎకరం భూమి కూడా లేదని ఆయన తెలియజేశారు. తనకు భూములు ఉన్నట్లు నిరూపించాలని బొత్సకు ఆయన సవాల్ విసిరారు.

దీనికి మళ్ళీ బొత్స సత్య సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజధానిలో సెంటు భూమి లేదని సుజనా చౌదరి అంటున్నారు. ఆయన భూఅక్రమాల చిట్టా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉందని స్పష్టం చేశారు. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయి, చందర్లపాడు మండలం గుడిమెట్ల ప్రాంతంలో ఆయన ఒక కంపెనీ పేరు మీద 110 ఎకరాలు ఉన్నాయి. సుజనా బంధువు యలమంచలి రుషి కన్య పేరున 14 ఎకరాల భూమి ఉంది.

జగ్గయ్యపేట మండలం జయంతీపురంలో చంద్రబాబు బంధువు రామారావు పేరు మీద 493 ఎకరాల ప్రభుత్వ భూమిని బదలాయించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం GO MS No 207, సెప్టెంబర్ 22, 2015 తేదీ మీద ఎకరం కేవలం రూ. 1 లక్షకే ఆ భూములను ధారాదత్తం చేసినట్లుగా బొత్స సత్యనారాయణ వివరించారు. రైతుల నుంచి సేకరించిన భూములను చంద్రబాబు ప్రభుత్వం తమ బంధువులకు అతి తక్కువ ధరకే గజం రూ 1000 చొప్పున అమ్మకాలు చేశారని మంత్రి ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఎవరికెన్ని భూములున్నాయో మొత్తం లెక్క బయటకు తీస్తాం అని బొత్స సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చారు.