Assembly Election Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ప్రారంభమైన కౌంటింగ్, 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓట్ల లెక్కింపు
సుమారు యాభై వేలమంది అధికారులు భద్రత కోసం మోహరించారు.
New Delhi, Mar 10: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు యాభై వేలమంది అధికారులు భద్రత కోసం మోహరించారు. పంజాబ్‌లో గెలుపు సంబురాలపై నిషేధం విధించారు. సుమారు 1,200 కౌంటింగ్ హాల్స్ సిద్ధంగా ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. కౌంటింగ్ చేపట్టనున్నారు. సిబ్బందికి మాస్క్, కేంద్రాల శానిటైజేషన్, ఫేస్ షీల్డ్ తప్పనిసరి చేశారు. లక్షణాలను ఉన్నవాళ్లను కౌంటింగ్ హాల్‌లోకి అనుమతించడం లేదు.
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా సాగుతుంది. రాజకీయ పార్టీల అధీకృత పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతి ఇస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. కొవిడ్ నిబంధనల నడుమ ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల అధికారులు చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క యూపీలోనే 250 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు భద్రతా విధుల్లో పాల్గొంటాయి.
పంజాబ్‌లో 45 కంపెనీల బలగాలను మోహరించినట్టు అధికారులు తెలిపారు. పంజాబ్‌లో కౌంటింగ్ సెంటర్ల దగ్గర కర్ఫ్యూ అమల్లో ఉంటుందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కరుణ రాజు చెప్పారు. గెలుపు సంబురాలపై నిషేధం ఉందన్నారు. ఇక్కడ గురువారాన్ని డ్రై డే(మద్యం అమ్మకాలపై నిషేధం)గా ప్రకటించారు. ఐదు రాష్ర్టాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య ఏడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలోకి రానున్నది. ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఉన్నది. పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలన్నీ వెల్లడించాయి. ఇదిలా ఉండగా, కౌంటింగ్ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కీలక నేతలను కౌంటింగ్ జరిగే రాష్ట్రాలకు పంపిస్తున్నాయి. ఇంచార్జులను నియమించాయి.