Bihar Assembly Elections 2020: బీహార్‌లో కొనసాగుతున్న పోలింగ్, నితీష్ కుమార్ సీఎం కాలేరంటూ చిరాగ్ పాశ్వాన్ జోస్యం, ఓటు హక్కును వినియోగించుకున్న పలువురు ప్రముఖులు
243 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు (Bihar Assembly Elections 2020) జరుగుతున్నాయి. 94 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ (bihar-assembly-election-polling) ప్రశాంతంగా సాగుతోంది. 17 జిల్లాలోని 94 నియోజకవర్గాలకు సుమారు 1463 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా మహారాజ్‌గంజ్ స్థానానికి 27 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అత్యల్పంగా దారౌలిలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
Patna, November 3: బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 243 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు (Bihar Assembly Elections 2020) జరుగుతున్నాయి. 94 నియోజకవర్గాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ (bihar-assembly-election-polling) ప్రశాంతంగా సాగుతోంది. 17 జిల్లాలోని 94 నియోజకవర్గాలకు సుమారు 1463 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా మహారాజ్‌గంజ్ స్థానానికి 27 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా.. అత్యల్పంగా దారౌలిలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఎన్నికల్లో 146 మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ ఒకరు పోటీలో నిలిచారు. రెండో దశలో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్‌తో పాటు ప్రస్తుత జేడీయూ సర్కారులోని నలుగురు మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు బరిలోకి దిగారు. బిహార్‌లో తొలి దశ పోలింగ్ అక్టోబర్ 28న జరగ్గా.. పోలింగ్ 54శాతం నమోదైంది. మూడో విడత ఎన్నికలు ఈ నెల 7న జరుగునుండగా.. ఈ నెల 10న ఫలితాలు వెలవడనున్నాయి.
భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలే పోలింగ్ ముగియనుంది. సున్నితమైన ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరించారు. నేటి పోలింగ్‌లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది.
బిహార్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో కలిసి బీజేపీ కలిసి పోటీ చేస్తోంది. రెండో దశలో 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండగా 46 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. జేడీ(యూ) తరఫున 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తాజాగా ఎన్డీయేలో చేరిన ముకేశ్ సాహ్ని వీఐపీ పార్టీ ఐదు స్థానాల్లో బరిలో ఉంది. మహాకూటమిలో 56 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. మిత్రపక్షం కాంగ్రెస్ 24, సీపీఐ, సీపీఎం నాలుగు సీట్లలో పోటీపడుతున్నాయి. అలాగే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీ 52 స్థానాల్లో తన అభ్యర్థులను నిలిపింది. తొలిసారిగా పార్టీ లింగమార్పిడి అభ్యర్థిని బరిలోకి దింపింది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దిఘాలో ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజధాని పట్నాలో ఉదయం 9.30 గంటల వరకు 10 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
రోసిరా పరిధిలోని 133,134 పోలింగ్ స్టేషన్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా నేతలు పట్టించుకోవడంలేదని ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
గోపాల్‌గంజ్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో ఈవీఎంకు ఫొటో తీసిన ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొబైల్ ఫోను స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. ఇదేవిధంగా గోపాల్‌గంజ్‌లో ఈవీఎంలు పాడయిపోయాయని వదంతులు వ్యాపింపజేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
నవంబరు 10వతేదీ తర్వాత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి అవరని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ జోస్యం చెప్పారు. 4 లక్షలమంది బీహారీల సూచనలతో తాను డాక్యుమెంటు రాతపూర్వకంగా ఇస్తానని చిరాగ్ పేర్కొన్నారు. ప్రజలు అహంకారం కారణంగా పెద్ద నాయకులను కూడా అధికారం నుంచి తొలగిస్తారని చిరాగ్ చెప్పారు. నితీష్ కుమార్ కు బీహార్ అభివృద్ధిపై రోడ్ మ్యాప్ లేదన్నారు. ఇదిలా ఉండగా బీహార్ ప్రజలు మార్పు అనే సునామీలో నితీష్ పార్టీ కొట్టుకుపోతుందని మహా ఘట్పంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీయాదవ్ చెప్పారు. బీహార్ ప్రజలు విద్య, ఆరోగ్య సంరక్షణ, ద్రవ్యోల్బణం మొదలైన ఏజెండాలపై ఓటు వేస్తారని ఆయన చెప్పారు.
బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్నా నగరంలోని దిఘా ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన గవర్నర్ చౌహాన్ ఓటు వేశాక బయటకు వచ్చి మీడియాకు తన చేతి వేలికి ఉన్న నల్ల సిరా చుక్కను చూపించారు. ‘‘ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలి, గతంలో కంటే పోలింగు శాతం పెరుగుతుందని నేను భావిస్తున్నాను’’ అని గవర్నరు చౌహాన్ వ్యాఖ్యానించారు. కరోనా బారిన పడి కోటుకున్న బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మంగళవారం రాజేంద్రనగర్ లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలోని 49వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటర్లు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఓటింగులో పాల్గొనాలని సుశీల్ మోదీ సూచించారు.
బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ తివారీపై ఓ స్వతంత్ర అభ్యర్థి మద్ధతుదారులు బైక్ లపై వచ్చి దాడి చేసిన ఘటన బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో జరిగింది. స్వతంత్ర అభ్యర్థి మంజిత్ సింగ్ కు చెందిన 50మంది మద్ధతుదారులు బైక్ లపై వచ్చి తనపై దాడి చేశారని బీజేపీ ఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ తివారీ ఆరోపించారు.స్వతంత్ర అభ్యర్థి మంజిత్ సింగ్ మనుషులు ఓటర్లకు డబ్బులు, చీరలు పంపిణీ చేస్తున్నారని, అతని మద్ధతుదారులు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే మిథిలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేసే వరకూ తాను పోలీసుస్టేషను ముందే కూర్చుంటానని చెప్పి మిథిలేష్ నిరసనకు దిగారు. తన కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మిథిలేష్ పోలీసుస్టేషను ముందు బైఠాయించారు.
బీహార్‌తో పాటు 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ -28 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్ -8, ఉత్తరప్రదేశ్ -7 స్థానాలకు ఉపఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశా, నాగాలాండ్, కర్ణాటక, జార్ఖండ్‌లో రెండేసి స్థానాలకు, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (దుబ్బాక), హర్యానాలో ఒక్కో స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది.