Mahagathbandhan Manifesto: వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు తీసుకువస్తాం, మేనిఫెస్టోను విడుదల చేసిన మహాఘట్ బంధన్ కూటమి, అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన చిరాగ్ పాశ్వాన్
ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి శనివారం మేనిఫెస్టోను (Mahagathbandhan Manifesto) విడుదల చేసింది. తాము గనక అధికారంలోకి వస్తే.. మొదటి శాసనసభా సమావేశాల్లోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును తీసుకొస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Singh Surjewala) హామీ ఇచ్చారు
Patna, October 17: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి శనివారం మేనిఫెస్టోను (Mahagathbandhan Manifesto) విడుదల చేసింది. తాము గనక అధికారంలోకి వస్తే.. మొదటి శాసనసభా సమావేశాల్లోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును తీసుకొస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Singh Surjewala) హామీ ఇచ్చారు. ప్రతిపక్ష బీజేపీ ముగ్గురితో పొత్తులు పెట్టుకుని రంగంలోకి దిగిందని..జేడీయూ నితీశ్ కుమార్‌తో, ఒవైసీతో పొత్తులు పెట్టుకున్నారని మండిపడ్డారు.
ప్రజల దృష్టిని మరల్చడానికి భారతీయ జనతా పార్టీ వివాదాస్పద వ్యాఖ్యలను తెరపైకి తెస్తోందని, జాలే నియోజకవర్గానికి చెందిన తమ అభ్యర్థి ఎన్నడూ జిన్నాను పొగడలేదని స్పష్టం చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థి నేతగా ఉన్న సమయంలో జిన్నా ఫొటోను తొలగించాలని ఆయన మోదీకి లేఖ రాశారని, అయినా మోదీ స్పందించలేదని సూర్జేవాలా తెలిపారు. వరదల కారణంగా రాష్ట్రం ఘోరంగా దెబ్బతింటే... ఇప్పటి వరకూ కేంద్ర బృందం వచ్చి పర్యటించిన పాపాన పోలేదని ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.
దీనిని బట్టి చూస్తే అందరూ సీఎం కుర్చీని పొందడం కోసం తెగ బిజీ అయిపోయినట్లు తెలుస్తోందని తేజస్వీ ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నా.... బిహార్ కు ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలం చెందారని తేజస్వీ విమర్శించారు.
ఇక అధికార జేడీయూని వ్యతిరేకిస్తూ బీజేపీకి మద్దతు పలుకుతున్న ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ మరోసారి విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒత్తిడి మేరకే ప్రధాని నరేంద్ర మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో 12 ర్యాలీలకు ఓకే చెప్పారని అన్నారు. నితీష్ ఒత్తిడి కనుక లేకుంటే ప్రధాని మోదీ ఈ ర్యాలీలకు పచ్చజెండా ఊపేవారు కాదని చెప్పారు. ఇక ఎన్‌డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన చిరాగ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే.
జేడీయూ ఉండగా ఎన్‌డీఏలో భాగయ్యేది లేదని స్పష్టం చేసిన ఆయన సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపడుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాకాని కాకుండా నితీష్ మరోసారి సీఎం అయితే ఎన్‌డీఏలో కలవకుండా ప్రతిపక్షంలో కూర్చుంటామని అన్నారు. 15 ఏళ్లుగా పాలన సాగిస్తున్న జేయూడీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని చిరాగ్ విమర్శించారు. ఇదిలాఉండగా.. ప్రధాని మోదీ ఫొటోలు వాడుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారనే బీజేపీ నేతల విమర్శలపై చిరాగ్ శుక్రవారం స్పందించిన సంగతి తెలిసిందే. తన గుండెల్లో మోదీ ఉన్నాడని, అనుమానం ఉన్నవారు తన గుండెను చీల్చి చూసుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు చిరాగ్ పార్టీకి సీట్లు వచ్చే పరిస్థితి లేదని, ఓట్లు చీల్చేందుకు అతను ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. అయితే, తన తండ్రి స్థాపించిన ఎల్‌జేపీ ఓట్లు చీల్చే పార్టీ అయితే, 2014, 2015, 2019 ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేపీ నేతలను చిరాగ్ సూటిగా ప్రశ్నించాడు. కాగా, అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7.. మూడు విడతల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి.