New Delhi, September 25: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని మూడు దశల్లో పోలింగ్ (Bihar Assembly Elections 2020 Dates And Schedule) జరపనున్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ( Election Commission of India) శుక్రవారం ప్రకటించింది. 243 స్థానాలున్న శాసనసభకు మూడుదశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, 7 తేదీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన ఉంటుందని వెల్లడించింది.
కోవిడ్–19 నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై (Bihar Assembly Election 2020) కొనసాగుతున్న సందిగ్ధతకు పుల్‌స్టాప్ పెట్టింది. ఓటింగ్ ప్రక్రియ ఎప్పటి మాదిరిగానే ఉదయం 7 గంటలకు మొదలవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల కోవిడ్ బాధిత ఓటర్ల కోసం అదనంగా ఒక గంట అంటే..సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని వివరించారు.
బీహార్‌లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా లేదని, దానివల్ల జీవన గమనం ఆగిపోకూడదు కదా అని పేర్కొన్నారు. నమ్మకంతో ముందుకు వెళ్లాలన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఒక లోక్‌సభ, 64 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల నిర్వహణపై ఈ నెల 29న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అతిపెద్ద ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకటని ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యానించారు.
మొదటి విడతలో అక్టోబర్ 28వ తేదీన 71 అసెంబ్లీ సీట్లకు, రెండో విడతలో నవంబర్ 3న 94 స్థానాలకు, నవంబర్ 7న జరిగే చివరి, మూడో విడతలో 78 స్థానాలకు పోలింగ్ ఉంటుందన్నారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపు నవంబర్ 10వ తేదీన జరుగుతుందని తెలిపారు. మొదటి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న, రెండో దశ పోలింగ్‌కు అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామనీ, మూడో దశ పోలింగ్‌కు అక్టోబర్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
కోవిడ్ నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం, సభలు, సమావేశాల విషయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు. ఇలా ఉండగా, కోవిడ్–19 మహమ్మారి దృష్ట్యా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఎన్నికల ప్రచారం మొదలు ఓట్ల లెక్కింపు వరకు కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటిస్తామని సీఈసీ తెలిపారు.
నామినేషన్ దాఖలుకు అభ్యర్థితోపాటు మరొకరికి మాత్రమే ఎన్నికల కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారానికి ఐదుగురికి మాత్రమే అనుమతిఉంటుంది. ఓటింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. కరోనా దృష్ట్యా ఒక గంట పోలింగ్ సమయాన్ని పొడిగించారు. చివరి గంటలో కరోనా రోగులకు ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఓటింగ్ సమయాల్లో మార్పులు ఉంటాయి. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది కోసం 7 లక్షల హ్యాండ్ శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్ షీల్డులు, 23 లక్షల జతల చేతి తొడుగులు (గ్లవ్స్) అందజేస్తారు. ఎన్నికల సభల్లో భౌతిక దూరం పాటించటం తప్పనిసరి. ఎన్నికలవేళ సోషల్‌మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మతకలహాలు సృష్టించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు ఉంటాయని సీఈసీ హెచ్చరించారు.