West Bengal Assembly Elections 2021: రాహుల్ గాంధీ కీలక నిర్ణయం, పశ్చిమ బెంగాల్ పర్యటనలన్నీ రద్దు, కరోనా నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని పిలుపు
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో (West Bengal Assembly Elections 2021) ఆయన పాల్గొనవలసిన అన్ని బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు.
New Delhi, April 18: దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో (West Bengal Assembly Elections 2021) ఆయన పాల్గొనవలసిన అన్ని బహిరంగ సభలను రద్దు చేసుకున్నారు.
భారీ బహిరంగ సభల ఏర్పాటు వల్ల పర్యవసానాలను ఆలోచించాలని ఇతర రాజకీయ నాయకులను ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో 6వ, 7వ, 8వ దశల పోలింగ్‌కు ముందు నిర్వహించతలపెట్టిన బహిరంగ సభలను సస్పెండ్ చేసినట్లు రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi ) ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఇదే విధంగా సభలను రద్దు చేయడంపై ఆలోచించాలని ఇతర రాజకీయ పార్టీల నేతలను కూడా కోరుతున్నానని తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లో భారీ బహిరంగ సభల్లో పాల్గొంటుండటంపై విమర్శలు వస్తున్నాయి. మోదీ భారీ బహిరంగ సభలను నిర్వహిస్తుండటం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆరోపించారు. ప్రజలను పట్టించుకోకుండా దిగ్భ్రాంతికరంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
Here's Rahul Tweet
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు విడుతల పోలింగ్ పూర్తి కాగా.. ఈ నెలలో మరో మూడు విడుతల పోలింగ్ జరుగనుంది. ఈ క్రమంలో పలు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీ సభలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా శనివారం పశ్చిమ బెంగాల్‌లో 7,713 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 34 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 45,300 ఉన్నాయి.