Chandrababu: ఓటమిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు. 'అమరావతి వెలవెలబోతుంది. ప్రజలు ఆవును వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు'. కారణం ఏమై ఉంటుంది?

పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారంటూ చంద్రబాబు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనక...

Amaravathi, 07th Aug: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై మాట్లాడుతూ ఒకింత భావోగ్వేగానికి లోనై ఏపీ ప్రజలను ఉద్దేశించి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది.

చంద్రబాబు మాట్లాడుతూ 'తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలను ఎన్నడూ చూడలేదని, ప్రజలు కేవలం తన పార్టీకి 23 సీట్లు ఇచ్చేంత తప్పు తానేం చేయలేదు' అని పేర్కొన్నారు.

ఏపీ ప్రజలు పట్టిసీమ నీళ్లు తాగారు కానీ, ఓట్లు వేయడం మరిచిపోయారు. పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారని (టీడీపిని కాకుండా వైసీపీని గెలిపించారని) తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.

ఇంకా మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మీద కోపం అమరావతిపై చూపిస్తున్నారని, అమరావతిని చంపేశారని అన్నారు.  తాము ప్రారంభించిన ప్రపంచస్థాయి రాజధాని నేడు వెలవెలబోతుందని పేర్కొన్నారు. తమ హయాంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేశామని, నేడు విమానాలన్నీ ఆగిపోయాయని తెలిపారు.  ప్రధానిని కలిసేందుకు వెళ్లిన సీఎం జగన్ రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడగాలి కానీ, తనపై ఫిర్యాదులు చేయడానికి వెళ్లారని. అయితే తనపై ఎలాంటి నిందలు మోపినా అవేవి జగన్ నిరూపించలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు 45 నిమిషాల పాటు ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. బుధవారం కూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండి ఉపరాష్ట్రపతి వెంకయ్య, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులు, పునర్విభజన చట్టంలో అంశాల అమలుపై చర్చిస్తున్నారని ముఖ్యమంత్రి వర్గాలు వెల్లడించాయి.

అయితే టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తుంది. జగన్ ఢిల్లీ టూర్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ప్రధానికి అందించిన వినతి పత్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసిన్నట్లు వారు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు తాజా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన అనుమానం కూడా అదేనని అర్థమవుతుంది.