Chandrababu On Re-elections: 'రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండు!' మరోసారి ఎన్నికలంటూ ఆశావాదా, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం చంద్రబాబు. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు.

జగన్ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా బోనులో నిలబెట్టేవరకు వదిలిపెట్టబోమని, తాడో పేడో తేల్చుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు....

File image of Ex CM Chandrababu Naidu.

Guntur, September 10: ప్రతి శుక్రవారం కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డిని (YS Jaganmohan Reddy) ఉద్దేశించి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu)  తీవ్రంగా మండిపడ్డారు. గతంలో తనపై 26 కేసులు, ఎన్నో పిటిషన్లు వేసినా, ఏ ఒక్కటి నిరూపించలేకపోయారని చంద్రబాబు అన్నారు. తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత అవమానించినా ప్రజల కోసం అన్నింటిని భరిస్తానని ఆయన స్పష్టం చేశారు.

గుంటూరులో జరిగిన టీడీపీ న్యాయవిభాగం సదస్సులో పాల్గొన్న చంద్రబాబు, సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ అరాచకాలపై పోరాడాలని టీడీపీ న్యాయ విభాగానికి ఆయన పిలుపునిచ్చారు. గతంలో తాను పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇంతటి అరాచకపాలన చూడలేదని ఆయన అన్నారు. "రివర్స్ టెండరింగ్ లాగా, రివర్స్ ఎన్నికలు వస్తే బాగుండు" అని ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మూడేళ్లలో జమిలి ఎన్నికలు రావొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో అనాగరిక పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రంలో 565 అరాచకాలు చేశారు. వీటిలో 10 హత్యలు, 201 దాడులు, 136 వేధింపులు, 52 అక్రమ కేసులు, 66 ఆస్తుల ధ్వంసం, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు ఊర్ల మీద పడి దాడులు చేస్తూ రాక్షసుల మాదిరే ప్రవర్తిస్తున్నారు అని చంద్రబాబు అన్నారు.

ఈనేపథ్యంలోనే తాము చేసే ధర్మపోరాటంలో న్యాయవాదులు టీడీపీకి అండగా నిలవాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా బోనులో నిలబెట్టేవరకు వదిలిపెట్టబోమని, తాడో పేడో తేల్చుకుంటామని చంద్రబాబు తేల్చిచెప్పారు.