Hemant Soren Resignation: జార్ఖండ్ సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిగా జార్ఖండ్ టైగర్ గా పేరొందిన నేత ఎంపిక
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో చంపై సోరెన్ సీనియర్ మంత్రిగా ఉన్నారు.
Ranchi, JAN 31: ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren resignation) రాజీనామా చేశారు. నగదు అక్రమ రవాణా కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుదీర్ఘంగా విచారించింది. ఈడీ (ED) ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఉంది. ఈడీ విచారణ నేపథ్యంలోనే సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కు పంపారు. ఝార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపై సోరెన్‌ను ప్రతిపాదించినట్లు ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్ ఠాకూర్ చెప్పారు. ‘‘మా నాయకుడిని ఎంపిక చేశాము. మా తదుపరి సీఎం చంపై సోరెన్’ అని ఆయన మీడియాకు తెలిపారు.
Here's Video
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. శాసనసభాపక్ష నేతగా చంపైను తమ కూటమి ఎన్నుకుందని తెలిపారు. చంపై సోరెన్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన ఎవరన్న ఆసక్తి దేశ రాజకీయాల్లో నెలకొంది. నిన్న రాత్రి ఓ సమావేశం జరిగింది. సోరెన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ (Champai Soren), హేమంత్ భార్య కల్పనా సోరెన్ పేర్లను సూచించినట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంలో చంపై సోరెన్ సీనియర్ మంత్రిగా ఉన్నారు.
సరైకేలా-ఖర్సవాన్ జిల్లా, జిలింగ్‌గోడ గ్రామానికి చెందిన సిమల్ సోరెన్ అనే రైతు పెద్ద కుమారుడు చంపై సోరెన్. చంపై సోరెన్ గతంలో తన తండ్రితో పాటు తమ పొలాల్లో పనిచేసేవారు. ఆయన సర్కారీ బడిలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్న వయస్సులోనే ఆయనకు వివాహం జరిగింది. ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 90వ దశకం చివరిలో జరిగిన జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో శిబు సోరెన్‌తో కలిసి చంపై చురుగ్గా పాల్గొన్నారు. ‘జార్ఖండ్ టైగర్’గా (Jarkhand Tiger) పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చంపై సోరెన్ తన సరైకేలా స్థానంలో ఉప ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జార్ఖండ్ ముక్తి మోర్చాలో చేరారు.