Karnataka Politics: తీర్పు వచ్చిన కొద్ది గంటలకే..కాషాయం కండువా కప్పుకున్న 15 మంది కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ, డిసెంబర్ 5న ఉప ఎన్నికలు
కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించి అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది కర్ణాటక సీఎం బీఎస్ యడ్డ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Bengaluru, November 14: ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించి అనర్హత వేటుకు గురైన 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మంది కర్ణాటక సీఎం బీఎస్ యడ్డ్యూరప్ప సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ -జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజీనామాలు చేసిన 17మందికి 123 రోజుల తర్వాత ‘అనర్హత’ వేటు నుంచి సుప్రీంకోర్టు తీర్పు విముక్తి కలిగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
గడిచిన 3 నెలలుగా సుప్రీంకోర్టులో పోరాడుతున్న అనర్హ ఎమ్మెల్యేల కేసులో తుది తీర్పు వెల్లడైంది. న్యాయమూర్తి ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ప్రకటించింది. వ్యక్తిగతం లేదా కారణమేదైనా రాజీనామా చేయవచ్చునంటూనే పార్టీ ఫిరాయించిన మేరకు అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయం సమంజసమేనని ధర్మాసనం ప్రస్తావించింది.
బీజేపీ తీర్థం పుచ్చుకున్న రెబల్ ఎమ్మెల్యేలు
కానీ అనర్హతకు గడువు విధించడం సరికాదని స్పష్టం చేసింది. 17 మంది ప్రస్తుత ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని తేల్చి చెప్పింది. దీంతో వారు మళ్లీ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 3 స్థానాలు మినహా 12 చోట్ల వారికే టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ కోర్ కమిటీ ఇప్పటికే తీర్మానించింది.
ఎన్నికల సంఘం 17 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలకు ఇటీవలే నొటీఫికేషన్ వెలువరించింది. డిసెంబర్ 5న ఉపఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 9, 2019న ఫలితాలు వెలువడనున్నాయి.