Kaushik Reddy Joins TRS: టీఆర్ఎస్‌లో చేరిన కౌశిక్ రెడ్డి, తెలంగాణ పునర్మిర్మాణం ట్రాక్ ఎక్కిందన్న సీఎం కేసీఆర్, దళితబంధు ఎన్నికల కోసం కాదని స్పష్టత, ఎవరి విమర్శలకు బెదరబోమని వ్యాఖ్యలు

పేదరికం, సామాజిక వివక్ష ఇంకా దళితవాడల్లో ఉంది. దళితబంధు అంటే పుట్నాలు, పేలాలు పంచినట్టు కాదు. దళితులకు రూ.10 లక్షల స్కీం వెనుక మంచి ఉద్దేశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల కోసం కాదన్నారు...

Kaushik Reddy Joins TRS Party | Photo: TRS

Hyderabad, July 21: తెలంగాణలో 'జంపింగ్ జపాంగ్' రాజకీయాలు నడుస్తున్నాయి. కొద్దికాలం క్రితం ఈటల రాజేంధర్ కారు దిగి బీజేపీలో చేరారు, అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవలే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఎల్. రమణ గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు, మళ్లీ ఇప్పుడు హుజూరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న పాడి కౌశిక్‌ రెడ్డి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మధ్యే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ నుంచి ఒక వికెట్ పడటం ఆయనకు ఒక ఝలక్ అనే చెప్పవచ్చు. ఏదైమైనా కౌశిక్ రెడ్డి తెరాసలో చేరడం అందరూ ఊహించిందే.

హుజూరాబాద్ తెరాస ఎమ్మెల్యే టికెట్ తనకేనంటూ ఆయన సంభాషించిన ఆడియో లీక్ అవ్వడం, ఒకానొక సందర్భంలో మంత్రి కేటీఆర్ చెవిలో గుసగుసలాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన తెరాసలో చేరబోతున్నారన్న వార్తలు నేడు నిజమయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సమక్షంలో పాడి కౌశిక్ రెడ్డి అధికారికంగా తెరాసలో చేరారు. ఆయనకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తెలంగాణ పునర్నిర్మాణం ఒక ట్రాక్‌ ఎక్కిందని, అయితే ఈ క్రమంలో విమర్శలకు భయపడి తమ ప్ర‌స్థానాన్ని ఆపమని సీఎం స్పష్టం చేశారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పేదరికం ఉంది. పేదరికం, సామాజిక వివక్ష ఇంకా దళితవాడల్లో ఉంది. దళితబంధు అంటే పుట్నాలు, పేలాలు పంచినట్టు కాదు. దళితులకు రూ.10 లక్షల స్కీం వెనుక మంచి ఉద్దేశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల కోసం కాదన్నారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల టైం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.  దళితబంధు కోసం హుజూరాబాద్‌నే పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నామని, రైతుబంధు, మొదటి సింహగర్జన కూడా హుజూరాబాద్‌లోనే ప్రారంభించినట్లు తెలిపారు. రైతుబీమా కూడా కరీంనగర్‌లోనే ప్రారంభించినట్లు సీఎం వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమకాలంలో తనని తిట్టినన్ని తిట్లు ఎవరినీ తిట్టలేదని సీఎం అన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను బెదరలేదు, వెనుకడుగు వేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంటే మఠం కాదు, రాజకీయ పార్టీ అని కేసీఆర్‌ మరోమారు స్పష్టం చేశారు. 'ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటాయి.. గెలుస్తాం.. ఓడుతం. రాజకీయం అన్న తర్వాత మనకు ఏదో ఒక పాత్ర వస్తుంది. అధికారంలో ఉండటమే గొప్ప కాదు. పార్టీ అంటేనే పవర్‌' అని సీఎం పేర్కొన్నారు.

బాధ్యత ఉన్నవాళ్లు విమర్శిస్తారు గానీ తిట్ల జోలికి పోరన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లు ఎప్పటికీ ఉంటారన్నారు. గుడ్డి విమర్శలకు భయపడి నిర్మాణాత్మకంగా పనిచేసే వాళ్లు తమ ప్రస్తానాన్ని ఆపరని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆపద్భందు కింద రూ.50 వేలు ఇస్తే రూ.30 వేలు దళారీలే కొట్టేసేవారన్నారు. కాగా తమ ప్రభుత్వంలో లబ్దిదారులకు వందకు వందశాతం ప్రభుత్వ ఫలాలు అందుతున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు గర్వంగా, సగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఇలా ఎన్నో పథకాలను ప్రజల క్షేమాన్ని కాంక్షించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. తెలంగాణ ఎక్కడి వరకు ఉంటే అక్కడి దాకా చెట్లున్నట్లు తెలిపారు. ప్రజలు అడిగితేనే చెట్లు పెంచుతున్నమా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. మంచి జరగడం ప్రారంభమైంది. ఇంకా జరగాలన్నారు. ప్రతీ ఎన్నికల్లో ప్రజలు తమని దీవిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ మీది.. రేపటి భవిష్యత్‌ యువకులదన్నారు.

గత ప్రభుత్వాలు గ్రామాల్లో కనీస మౌలిక వసతులు సమకూర్చడంలో విఫలమయ్యాయని సీఎం అన్నారు. ఒకప్పుడు చెట్లు కొట్టుడు తప్ప పెట్టుడే లేదన్నారు. ఒకప్పుడు లేని చెట్లు ఇప్పుడు ఎట్ల వచ్చినయని సీఎం ప్రశ్నించారు. 12,769 గ్రామ పంచాయితీల్లో ట్రాక్టర్‌, ట్యాంకర్‌ ఉంది. ప్రతీ రోజు చెత్తను క్లియర్‌ చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటయ్యాయి. నేడు ప్రతీ ఊరు పచ్చదనంతో కళకళలాడుతుందన్నారు.