Lalu Prasad Yadav: డీఎల్ఎఫ్ కేసులో లాలూకు సీబీఐ క్లీన్ చిట్, ఆయనకి వ్యతిరేకంగా ఆధారాల్లేవు, రెండేళ్ల విచారణ తర్వాత ఆ ఒప్పందంలో ఎటువంటి అక్రమం జరగలేదని తెలిపిన సీబీఐ
డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ (Lalu Prasad Yadav Gets Clean Chit in DLF Bribery Case) ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
New Delhi, May 22: డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ (Lalu Prasad Yadav Gets Clean Chit in DLF Bribery Case) ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష పడటంతో ఆయన మూడేళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి, ఏప్రిల్‌లో బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. సీబీఐ 2018 జనవరిలో లాలూ ప్రసాద్ యాదవ్, రియల్ ఎస్టేట్ డెవలపర్ డీఎల్ఎఫ్ గ్రూప్‌లపై (DLF Group) వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపింది.
ముంబైలోని బాంద్రాలో రైల్వే ప్రాజెక్టు, న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ ప్రాజెక్టు కోసం డీఎల్ఎఫ్ గ్రూపు మాజీ రైల్వేశాఖ మంత్రి లాలూ యాదవ్‌కు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలో కొంత స్థిరాస్తిని లంచంగా ఇచ్చిందని, అప్పట్లో ఆయన రైల్వే మంత్రిగా ఉండేవారని సీబీఐ (CBI) ఆరోపించింది. యూపీఏ 2 ప్రభుత్వ హయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. కాగా డీఎల్‌ఎఫ్ లంచం కేసులో 2008 జనవరి నుంచి 2021 ఏప్రిల్ వరకు లాలూ జైలులోనే ఉన్నారు.
ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే ఓ బోగస్ కంపెనీ అతి తక్కువ ధరకు ఢిల్లీలో ఓ ప్రాపర్టీని సొంతం చేసుకున్నదని, డీఎల్ఎఫ్ ఫండింగ్‌తో ఎక్కవ ధర పలికే భూమిని తక్కువ ధరకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో సుమారు రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తిని 2007 డిసెంబరులో కొనుగోలు చేసినట్లు ఆరోపించింది. అనేక బూటకపు కంపెనీల ద్వారా డీఎల్ఎఫ్ హోం డెవలపర్స్ ఈ ఆస్తికి నిధులను సమకూర్చినట్లు ఆరోపించింది. నిజానికి అప్పట్లో ఈ ఆస్తి విలువ రూ.30 కోట్లు అని తెలిపింది.
తేజస్వియాదవ్ తో పాటు లాలూ కుటుంబ సభ్యలు ఆ ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు. డీఎల్ఎఫ్, లాలూ మధ్య కుదిరిన లావాదేవీలను కూడా సీబీఐ విచారించింది. అయితే రెండేళ్ల విచారణ తర్వాత ఆ ఒప్పందంలో ఎటువంటి అక్రమం జరగలేదని (Lalu Prasad Yadav Gets Clean Chit) సీబీఐ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.జాతీయ మీడియా కథనాల ప్రకారం, రెండేళ్ళపాటు జరిగిన దర్యాప్తులో ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో ప్రాథమిక దర్యాప్తును ముగించారు.