Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపు, గవర్నర్‌ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధమంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన శివసేన, విచారణకు అంగీకరించిన కోర్టు

అధికార పక్షం శివసేన.. బలపరీక్షపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సుప్రంకోర్టులో సవాల్‌ చేసింది. పార్టీ చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

Mumbai, June 29: మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఊహించని మలుపు (Maharashtra Political Crisis) చోటు చేసుకుంది.. అధికార పక్షం శివసేన.. బలపరీక్షపై గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. పార్టీ చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో శివ సేన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అంగీకరించింది (Supreme Court Agrees To Hear Shiv Sena's Plea) కోర్టు. జస్టిస్‌ సూర్యకాంత్‌, పర్దివాలా నేతృత్వంలోని బెంచ్‌ సాయంత్రం విచారణ చేపట్టనుంది.

గవర్నర్‌ ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయిస్తామని శివ సేన కీలక నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంలో శివసేన అభ్యర్థిస్తోంది. శివ సేన తరపున అభిషేక్‌ సింఘ్వి వాదిస్తుండగా.. షిండే వర్గం తరపున నీరజ్‌కిషన్‌ కౌల్‌ వాదించనున్నారు. గవర్నర్‌ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధం అంటూ వాదించిన సింఘ్వితో ఏకీభవించిన బెంచ్‌.. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. బల నిరూపణ డాక్యుమెంట్లపై ప్రశ్నించిన బెంచ్‌కు సాయంత్రంలోగా సమర్పిస్తామని సింఘ్వి చెప్పడంతో.. సాయంత్రం ఐదు గంటలకు శివసేన పిటిషన్‌పై విచారణ (Plea Against Floor Test At 5PM Today) చేపట్టనున్నట్లు తెలిపింది.

రేపటితో మహా డ్రామాకు తెర, బల నిరూపణకు ఆదేశించిన గవర్నర్ భగత్‌సింగ్‌ కోష్యారి, ఇప్పటివరకు పార్టీల బలబలాలు ఇవే..

ఇదిలా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో గురువారం బలపరీక్ష చేపట్టి తీరాలని ఉద్దవ్‌థాక్రే సర్కార్‌ను ఆదేశించారు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారి. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి రాజేంద్ర భగవత్‌కు బుధవారం ఉదయం గవర్నర్‌ లేఖరాశారు. గురువారం సాయంత్రం లోగా.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన రికార్డులను భద్రపర్చాలని గవర్నర్‌ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది.

కాగా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై సుప్రీంకోర్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ ఆదేశించడం చట్టవిరుద్ధమని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు. గవర్నర్‌పై ద్వజమెత్తిన రౌత్, బిజెపి నాయకులు తనను కలిసి విశ్వాస ఓటు వేయాలని కోరిన తర్వాత రాజ్‌భవన్ రాఫెల్ కంటే జెట్ స్పీడ్‌తో పనిచేసిందని అన్నారు. తన కోటా నుంచి రాష్ట్ర శాసనసభ ఎగువ సభకు 12 మంది ఎమ్మెల్సీల నామినేషన్‌కు సంబంధించిన ఫైల్ చాలా కాలంగా తన వద్ద పెండింగ్‌లో ఉందని గవర్నర్‌కు గుర్తు చేశారు.

16 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇది (ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్) చట్టవిరుద్ధమైన చర్య. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిగితే, గవర్నర్ మరియు బిజెపి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కితే, అప్పుడు ఎస్సీ జోక్యం చేసుకోవాలి. ," అని రౌత్ విలేకరులతో అన్నారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం చేస్తామని చెప్పారు.