No Confidence Motion: మోదీ అహంకారం వల్ల దేశం తగలబడిపోతోంది, మీరే దేశ ద్రోహులంటూ లోక్ సభలో బీజేపీపై విరుచుకుపడిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రసంగం హైలెట్స్ ఇవిగో..
బీజేపీపై విరుచుకుపడ్డారు.ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
New Delhi, August 9: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Trust Motion)పై రెండోరోజు చర్చ ప్రారంభమైంది.ఈ చర్చ సందర్భంగా మణిపుర్ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. బీజేపీపై విరుచుకుపడ్డారు.ప్రధాని మోదీనే లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చర్చను ప్రారంభించి ప్రసంగించారు. తన లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత ఆయన తొలిసారిగా మాట్లాడారు. భారత్ దేశాన్ని మణిపుర్‌లో హత్య చేశారని అధికార పక్షంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బుధవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన ఆవేశపూరితంగా ప్రసంగించారు.
కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లానని, కానీ మన ప్రధాని ఇంత వరకు ఆ రాష్ట్రానికి వెళ్లలేదన్నారు. మణిపూర్ మన దేశంలో లేదని ఆయన భావిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మణిపూర్ అన్న పదాన్ని తాను వాడానని, కానీ వాస్తవం ఏంటంటే ఆ రాష్ట్రం ఇక లేదన్నారు. మణిపూర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించినట్లు రాహుల్ పేర్కొన్నారు. మణిపూర్‌ను విభజించి, విడగొట్టినట్లు రాహుల్ అన్నారు. మణిపూర్‌ను చంపి భారత్‌ను హత్య చేశారని ఆరోపించారు. మీరే దేశద్రోహాలు అని రాహుల్ విమర్శించారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారన్నారు.
అక్కడి పునరావాస శిబిరాల్లో మహిళలు, పిల్లలతో మాట్లాడాను. మీకు ఏమి జరిగింది..? అని ఓ మహిళను ప్రశ్నించా.. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా ఏకైక బిడ్డను కళ్లెదుటే కాల్చిచంపారు. ఆ రోజు రాత్రి మొత్తం నా బిడ్డ శవం వద్దే పడి ఉన్నాను. ఆ తర్వాత నాకు భయం వేసింది. చివరికి నా సర్వస్వం వదిలి కట్టుబట్టలతో వెళ్లిపోయాను’ అని చెప్పింది. ఒక ఫొటో మాత్రం చూపింది. మరో క్యాంపులో ఓ సోదరని ప్రశ్నించగా.. ఆమెకు జరిగింది గుర్తుకు వచ్చి వణికిపోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత స్పృహ కోల్పోయింది.
మీకు రెండు ఉదాహరణలు మాత్రమే చెప్పాను. స్పీకర్ సర్.. వీళ్లు (పాలకులు) మణిపుర్‌లో భారత్‌ను హత్య చేశారు. దేశం ప్రాణం తీశారు. నేను ప్రసంగం మొదట్లో చెప్పినట్లు భారత్ ఓ గొంతు.. అది ప్రజల హృదయ స్పందన. దానిని చంపేశారు. అంటే భారత మాతను మీరు మణిపుర్‌లో హత్య చేశారు. మీరు దేశ ద్రోహులు, దేశ ప్రేమికులు కాదు. అందుకే మీ ప్రధాని మణిపుర్‌కు వెళ్లడంలేదు’’ అని బీజేపీపై రాహుల్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో బీజేపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు.
భారత ప్రజల ఆవేదనను ప్రధాని మోదీ అర్థం చేసుకోరు అని, కానీ ఆయన ఇద్దరి వ్యక్తుల మాటలు వింటారని ఆరోపించారు. రావణుడు ఇద్దరి మాటలు మాత్రమే వినేవారని, అలాగే మోదీ కేవలం అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారని ఆరోపించారు. లంకను హనుమంతుడు కాల్చలేదని, రావణుడి అహంకారమే ఆ లంకను తగలపెట్టిందని, ప్రధాని మోదీ అహంకారం వల్ల దేశం తగలబడిపోతోందన్నారు. లోక్‌సభ ఎంపీగా తనను మళ్లీ నియమించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ థ్యాంక్స్ తెలిపారు.
రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం పునరుద్ధరించిన లోక్‌సభ సెక్రటేరియట్
నేను సముద్ర తీరం నుంచి మంచు పర్వతాల వరకూ నడిచాను. చాలా మంది నన్ను పాదయాత్రపై ప్రశ్నించారు. తొలుత వారికి ఏమి చెప్పాలో నాకు తెలియలేదు. కానీ, యాత్ర మొదలైన కొన్నాళ్లలోనే విషయం నాకు అర్థం కావడం మొదలైంది. దేని కోసం నేను మరణనానికి కూడా సిద్ధమో.. దేని కోసం జైళ్లకు వెళ్లడానికి సిద్ధమో.. అది అర్థం కావడం మొదలైంది. కొన్నేళ్ల నుంచి నేను నిత్యం దాదాపు 10 కిలోమీటర్ల పరిగెత్తేవాడిని.
అలాంటిది రోజుకు పాతిక కిలోమీటర్లు నడవడం ఏముంది అనుకొన్నా. అప్పట్లో నాలో అహంకారం ఉంది. కానీ, ఆ అహంకారాన్ని భారత్ ఒక్క క్షణంలో మాయం చేస్తుంది. రెండు మూడు రోజుల్లోనే నాకు ఒళ్లు నొప్పులు మొదలయ్యాయి. నాలో అహంకారం మాయమైంది. ఈ యాత్రలో ప్రజలు నాకు అండగా నిలిచారు. జనసందోహాన్ని చూసి ఒక్కోసారి మాట్లాడలేకపోయా. ప్రతి రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వివిధ వర్గాలు చెప్పింది విన్నాను.
నా వద్దకు ఓ రైతు వచ్చాడు.. అతడికి పంటల బీమా దక్కిందా అని అడిగాను. లభించలేదని చెప్పాడు. ఆ క్షణంలో రైతు మనసులోని బాధను నేను అనుభవించాను. అతడి ఆకలి బాధ నాకు తెలిసొచ్చింది. ఆ తర్వాత యాత్ర తీరు మారిపోయింది. నాటి నుంచి చుట్టుపక్కల ప్రజల నినాదాలు నాకు వినిపించేవికాదు. నాకు కష్టాలు చెప్పుకొనేవారి ఆవేదన మాత్రమే వినిపించేది. ఈ దేశాన్ని భూమి, బంగారం, భాషల పేరుతో రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ, ఈ దేశం ఓ గొంతుక. దానిని వినాలంటే మన మనసులోని అహంకారాన్ని, ద్వేషాన్ని త్యజించాలి. అప్పుడే హిందూస్థాన్ గొంతు వినిపిస్తుంది.
నా తల్లి ఒకరు ఇక్కడ ఉన్నారు.. మరో తల్లిని మణిపుర్‌లో చంపారు. భారత సైన్యం ఒక్కరోజులోనే మణిపుర్‌లో శాంతి తీసుకురాగలదు. కానీ, అలా చేయడం లేదు. ప్రధాని దేశ హృదయ స్పందన వినడంలేదు. ఆయన ఇద్దరి మాటలు మాత్రమే వింటారు. అదానీ కోసం మోదీ ఏం చేశారో చూడండి. రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటే వింటాడు. అలానే మోదీ.. అదానీ, అమిత్‌షా మాటలే వింటారు. లంకను రావణుడి అహంకారమే కాల్చింది. దేశంలో మీరు కిరోసిన్ చల్లుతున్నారు. మణిపుర్‌లో చల్లారు. ఇప్పుడు హరియాణాలో చల్లుతున్నారు’’ అని తన ప్రసంగాన్ని రాహుల్ ముగించారు.
రాహుల్ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ప్రసంగం మధ్యలో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు జోక్యం చేసుకొని మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పాలకుల చేసిన దానికి రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.