Supreme Court: 48 గంటల్లోగా అభ్యర్థి క్రిమినల్ రికార్డు బయటపెట్టాలి, రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, పెగాసస్ స్పైవేర్ విచారణలో వ్యవస్థపై తప్పనిసరిగా నమ్మకం ఉండాలని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను (Political Parties must publish criminal antecedents) బయటపెట్టాలని స్పష్టం చేసింది.
New Delhi, August 10: దేశంలోని రాజకీయ పార్టీలకు దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను (Political Parties must publish criminal antecedents) బయటపెట్టాలని స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడి ధర్మాసనం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతేడాది ఫిబ్రవరి 13న తాము ఇచ్చిన తీర్పులో మార్పులు చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం.. సదరు అభ్యర్థే తమ ఎంపిక పూర్తయిన 48 గంటల్లోపు (within 48 hours of selection) లేదంటే నామినేషన్ పత్రాలు వేసే తొలి తేదీకి రెండు వారాల ముందు తమపై ఉన్న క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలి. అయితే ఇప్పుడా ఆదేశాలకు మార్పులు చేస్తూ.. ఆయా పార్టీలే తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టాల్సిందిగా సుప్రీం ధర్మాసనం స్పష్టంచేసింది. తమ అభ్యర్థుల క్రిమినల్ రికార్డులను బయటపెట్టని పార్టీల గుర్తులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను పాటించని పార్టీలపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ కోరింది.
ఎంపికైన అభ్యర్థులు 48 గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని లేకపోతే నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి కనీసం రెండు వారాల ముందు ఈ వివరాలను బయలు పర్చాలని ఆదేశించింది. తాజా తీర్పులో దాన్ని 48 గంటలకు పరిమితం చేసింది. పార్టీలు నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎందుకు ఎంచుకుంటున్నాయో కారణాల్ని వివరించాలని, కేసుల వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కోర్టు వెల్లడించింది.
తమ అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయని రాజకీయ పార్టీల గుర్తులను నిలిపివేయాలంటూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి అలాగే గతంలో ఇచ్చిన ఆదేశాలను పార్టీలు పాటించనందున అవి కోర్టును ధిక్కరించినట్లు భావించాలని పిటిషనర్లు కోరారు. మరోపక్క కోర్టు ఆదేశాల్ని పాటించనందుకు సీపీఐ(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కోర్టుకు క్షమాపణలు తెలియజేశాయి. అలాగే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీల గుర్తుల్ని నిలిపివేస్తామంటూ ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది.
పెగాసస్ స్పైవేర్ విచారణ సందర్భంగా.. వ్యవస్థను ఉపయోగించుకునేవారు దానిని నమ్మాలని సుప్రీంకోర్టు తెలిపింది. పెగాసస్ స్పైవేర్‌తో కొందరిపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టుల్లో పిటిషన్లు వేసి, సామాజిక మాధ్యమాల్లో అవే అంశాలపై సమాంతరంగా చర్చలు జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పెగాసస్‌తో నిఘా ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చింది. ఈ అంశంపై విచారణ జరుగుతున్న సమయంలో బహిరంగ వేదికలపై చర్చించడం మానుకోవాలని పిటిషనర్లను కోరింది.
ఈ అంశంపై ఆసక్తిగల పిటిషనర్ ఎవరైనా, వార్తా పత్రికల్లోని విషయాలను చెప్తూ ఉంటే, అటువంటి వారు కోర్టు గదిలో సరైన మార్గంలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని, బయట నుంచి కాదని ఆశిస్తున్నామని తెలిపింది. కోర్టులో చర్చ జరగాలని పిటిషనర్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని పేర్కొంది. వారికి వ్యవస్థపై తప్పనిసరిగా నమ్మకం ఉండాలని తెలిపింది. ‘‘కానీ ఈ సమాంతర చర్చ, సమాంతర సంభాషణ....’’ అని తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.
క్రమశిక్షణతో వ్యవహరించాలని చెప్తూ తాము కొన్ని ప్రశ్నలను అడిగామని పేర్కొంది. విచారణ ప్రక్రియ అనేది ఒకటి ఉందని తెలిపింది. కొన్నిసార్లు అది కొందరికి అసౌకర్యంగా ఉండవచ్చునని, మరికొన్నిసార్లు సౌకర్యవంతంగా ఉండవచ్చునని తెలిపింది. అయితే ప్రక్రియ అనేది ఆ విధంగానే ఉంటుందని పేర్కొంది. ఇరు పక్షాలు దీనిని ఎదుర్కొనవలసి ఉంటుందని తెలిపింది. దేనినైనా కోర్టు దృష్టికి తేవాలనుకుంటే, సంబంధిత దస్తావేజులను కోర్టుకు సమర్పించాలని తెలిపింది.
సీజేఐ జస్టిస్ రమణ మాట్లాడుతూ, ఇది పిటిషనర్లకు తమ ధర్మాసనంలోని అందరు న్యాయమూర్తుల సందేశమని తెలిపారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. పిటిషనర్లలో అడ్వకేట్ ఎంఎల్ శర్మ, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ), పాత్రికేయులు ఎన్ రామ్, శశి కుమార్, పరంజయ్ గుహ ఠకుర్ట, రూపేష్ కుమార్ సింగ్, ఇప్షిత శతాక్షి, ఎస్ఎన్ఎం అబ్డి, ప్రేమ్ శంకర్ ఝా తదితరులు ఉన్నారు.