New Delhi, August 10: దేశంలో తాజాగా 30 వేలకు దిగువగా కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. 24 గంటల్లో 28,204 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. 373 మంది వైరస్‌తో బాధపడుతూ మృతి (Coronavirus Deaths) చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 3,88,508 ఉండగా కరోనా రికవరీ రేటు భారీగా పెరిగింది.
ప్రస్తుతం 97.45 శాతంగా ఉంది. అయితే మరణాల సంఖ్య అదేస్థాయిలో ఉంది. తాజాగా 41,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే 54,91,647 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 51.45 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 48.32 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది.
అమెరికాలో రోజు రోజుకు డెల్టా కరోనా కేసులు పెరుగుతున్నాయి. టెక్సాస్ రాజధాని నగరం ఆస్టిన్‌లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగరంలో 24 లక్షల జనాభా ఉండగా శనివారం నాటికి అక్కడి ఆసుపత్రుల్లో కేవలం 6 ఐసీయూ బెడ్లు మాత్రమే మిగిలాయి. 313 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు టెక్సాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నదని, బెడ్స్ కొరత వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిందని పబ్లిక్ హెల్త్ మెడికల్ డైరెక్టర్ డెస్మార్ వాక్స్ వెల్లడించారు. విపత్తు పొంచి ఉన్నదంటూ ఎస్‌ఎంఎస్, ఈ మొయిల్స్, ఫోన్ల ద్వారా పౌరులను హెచ్చరించారు.
ఆస్టిన్ నగరంలో డెల్టా వేరియంట్ కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో గత నెల రోజులుగా ఆసుపత్రులలో కొత్త అడ్మిషన్లు 600 శాతంపైగా పెరిగింది. ఐసీయూ వార్డుల్లో చేరే రోగుల సంఖ్య కూడా 570 శాతం దాటింది. వెంటిలేటర్‌పై ఉన్న కరోనా రోగుల సంఖ్య జూలై 4న ఎనిమిది ఉండగా శనివారం నాటికి 102కు పెరిగింది. ఆస్టిన్ నగరంలో కరోనా కేసులు పది రెట్లు పెరుగడంతో గరిష్ఠ ప్రమాద స్థాయి 5వ దశకు చేరుకున్నట్లు రెండు రోజుల కిందటే నగర ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా టీకాలు తీసుకోవాలని, ఇండ్లలోనే ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల నమోదు లక్ష దాటింది.