Andhra Pradesh: టీడీపీ ఆందోళన దేనికి? చంద్రబాబు నివాసంపై డ్రోన్లు ఎగిరినందుకా? ప్రభుత్వం వరదలను కట్టడి చేయనందుకా? ప్రజలకు విసుగు తెప్పిస్తున్న ఏపీ రాజకీయాలు.

ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని టీడీపీ- వైసీపీ నేతల రాజకీయాలు, ఎవరి అనుకూల మీడియాలో వారు చేసుకునే ప్రచారాలు ఏపీ ప్రజలకు విసుగు, అసహనం తెప్పిస్తున్నాయి...

Amaravathi, 19 August: ఇండియాలో జరిగే రాజకీయాలు ఒక ఎత్తైతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాజకీయాలు మరో ఎత్తు.  ఏ ప్రదేశంలోనైనా ఏవైనా ఎన్నికలు దగ్గర్లో ఉంటే  అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు  జరగటం సహజం. కానీ, ఏపీలో మాత్రం 'ఎనీ టైమ్ రాజకీయం'. సందర్భమేదైనా, సమయమేదైనా 365రోజులు ఈ రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.

తాజాగా, చంద్రబాబు నివాసంపై డ్రోన్లు ఎగరటాన్ని తెలుగు దేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది.  చంద్రబాబు భద్రత మరియు టీడీపీ నేతలపై జగన్ ప్రభుత్వం కక్షగట్టిందంటూ ఆందోళనకు దిగారు. ఒక జడ్ ప్లస్ కేటగిరీ ఉండే నాయకుడి ఇంటిపై డ్రోన్లు ఎలా ఎగరనిస్తారు అంటూ టీడీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.  ఇటు అధికార వైసీపీ నాయకులు కూడా అంతే దీటుగా బదులిస్తూ వస్తున్నారు.

వరద పరిస్థితిని అంచనా వేయడం కోసమే తాము డ్రోన్ల ప్రయోగం చేపట్టామని రాష్ట్ర మంత్రులు, ఇతర అధికార పక్షం నేతలు  స్పష్టం చేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు రాజకీయాలు మానుకోవాలని వారు ఎద్దేవా చేస్తున్నారు.  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా ఇరిగేషన్ అధికారులు, స్థానిక పోలీసులు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగింది. వారు స్థానిక పోలీసులకు ఈ విషయంపై సమాచారం ఇవ్వాల్సింది. ఇందులో ఎలాంటి కుట్రలు లేవు, విషయాన్ని రాజకీయం చేయొద్దని ఆయన కోరారు.

అయితే టీడీపీ మాత్రం పట్టు విడవడం లేదు. ఈ విషయాన్ని గవర్నర్ విశ్వభూషన్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. గవర్నర్ ను కలిసిన అనంతరం టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వైఫల్యంపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కృష్ణానదికి వరదలొస్తాయని తెలిసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదంటూ ఆయన  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

అంతకుముందు మరో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఏకంగా తమ అధినేత చంద్రబాబును హతమార్చే కుట్ర జరుగుతుంది. మంత్రులే డ్రోన్లతో రెక్కీ నిర్వహించారు అంటూ భారీ వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ ఒక్కటి గమనిస్తే టీడీపీ నేతల మాటల్లో ఒక విషయ స్పష్టత, పరిపక్వత  లేదు. చంద్రబాబు మొదలుకొని, నారా లోకేశ్ సహా మిగతా టీడీపీ లీడర్ల మాటలందరిదీ ఒకటే ధోరణి. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు సైతం కొంచెం అటూఇటూగా టీడీపీ నేతల వ్యాఖ్యలనే పోలి ఉంటున్నాయి.

ఇక్కడ జనాలు వరదల్లో చిక్కుకున్నారు. వాళ్లకు సహయం అందడం లేదనే వీరి మాటలు కేవలం వీరు చేసే రాజకీయానికి మానవత్వం అనే మసాల పూయడమే తప్ప, ఒక్కరిలో కూడా జనాలపై ప్రేమ గానీ, జనం ఇబ్బందుల్లో ఉన్నారనే బాధ కానీ ఎంతమాత్రం కనిపించదు.

ఎన్నికల్లో ఓటమి, అధికారం చేజారిన దగ్గర్నుంచి టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా ఇటు జగన్ ప్రభుత్వంపై , అటు ప్రజలపై కూడా వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూనే ఉన్నారు. 'ఏపీలో ఏదో జరిగిపోతుంది' అని అరిచి పెద్దది చేసి చూపించడం తప్ప విషయం ఏమీ లేదు.

ఇటు సీఎం జగన్ పాలన ఎలా ఉందనేది పక్కనపెడితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్, వైసీపీ నాయకుల పట్ల టీడీపీ ఎలా అయితే ప్రవర్తించిందో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ కూడా అదే స్టైల్లో ముందుకెళ్తున్నాడు.

ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని టీడీపీ- వైసీపీ నేతల రాజకీయాలు, ఎవరి అనుకూల మీడియాలో వారు చేసుకునే ప్రచారాలు ఏపీ ప్రజలకు విసుగు, అసహనం తెప్పిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నాయకులను భరిస్తున్న ఏపీ ప్రజల మనోధైర్యం చాలా గొప్పది.