Prashant Kishor:ప్రశాంత్ కిషోర్‌కు సోనియా బంపర్ ఆఫర్, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ కోరిన సోనియా, 2024 ఎన్నికల మ్యాప్ రూపొందించడం, పొత్తులపై సోనియాకు వివరించిన పీకే
2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కుమార్ అందించిన వివరణాత్మక ప్రజెంటేషన్ పార్టీ అధిష్టానానికి సమర్పించారు.
New Delhi, April 16: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కు (Prashant Kishor) పిలుపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శనివారం నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ కిషోర్‌ను (Prashant Kishor) కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలని కోరినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రశాంత్ కుమార్ అందించిన వివరణాత్మక ప్రజెంటేషన్ పార్టీ అధిష్టానానికి సమర్పించారు. అనంతరం సోనియా గాంధీ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సోనియా ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ లో చేరమని కోరినట్టుగా సంబధిత వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ కాంగ్రెస్ (Congress) సలహాదారుగా పనిచేసిన ఆయన్ను పార్టీలో చేరి తమతో కలిసి పనిచేయాలని కోరినట్టు తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అవసరమైన రోడ్‌మ్యాప్, సంస్థాగత మార్పులకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ అన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలపైనే అధిక దృష్టి పెట్టాలని ప్రశాంత్ సూచించినట్టు తెలుస్తోంది. సంస్థాగత నిర్మాణం, ముఖ్యంగా కమ్యూనికేషన్ విభాగం, పూర్తి సమగ్ర మార్పు అవసరమని ప్రశాంత్ చెప్పినట్టు తెలిసింది.
కమ్యూనికేషన్ వ్యూహాన్ని పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ హైకమాండ్ కు తెలియజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కెసి వేణుగోపాల్ (KC Venu gopal) మాట్లాడుతూ.. 2024 ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. అయితే పార్టీ చిన్న గ్రూపు నేతలు ఉంటారని, ఈ బృందానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 370 లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని భావిస్తోంది. అయితే మిగిలిన స్థానాల్లో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ చెప్పినట్లు పార్టీ అగ్రవర్గాల సమాచారం. ప్రెజెంటేషన్‌పై చిన్నపాటి నేతల బృందం చర్చిస్తుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్ చర్చించారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పనితీరు రోజురోజుకీ దిగజారిపోతోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అన్ని చోట్లా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒకప్పటిలా కాంగ్రెస్ పార్టీపై ఆదరణను పునరుద్ధరించేందుకు పార్టీని బలోపేతం చేసేందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని కూడా ఈ భేటీకి పిలవడంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. అంతేకాదు.. పెద్ద ఎత్తున పార్టీలో మార్పులు కూడా జరుగబోతున్నాయనే టాక్ నడుస్తోంది. త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెట్టింది. గుజరాత్ నుంచి తమ పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీని దెబ్బతీసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్.