TS-iPASS: దక్షిణ భారతదేశం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి, పారిశ్రామికీకరణలో రాజకీయాలు సరికాదు, బుల్లెట్ రైలు అంటే ఉత్తర భారతదేశమేనా? మోదీ సర్కార్ లక్ష్యంగా టీఎస్ ఐటీ మంత్రి కేటీఆర్ విసుర్లు
దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు మరియు చైన్నై నగరాలు లేవా? ఈ మూడు ప్రాంతాలను పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే అద్భుతాలు చేసి చూపుతాం, వారికంటే మెరుగైన ఫలితాలు తీసుకురాగలమని....
Hyderabad, December 4: హైదరాబాద్ శిల్పాకళావేదికలో టీఎస్ ఐపాస్ (TS-iPASS) ఐదో వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR), కార్మిక మంత్రి మల్లారెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలని తెలిపారు. సమర్థవంతంగా పనిచేస్తున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని, కానీ కేంద్రం నుంచి అలాంటి ప్రోత్సాహం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర సహాకారం లేకున్నా, పారిశ్రామికీకరణలో తెలంగాణ రాష్ట్రం (Telangana) వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేవలం రాజకీయ కారణాల తోనే దిగువ రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు. బుల్లెట్ రైలు అంటే ముంబై, దిల్లీలేనా? హైదరాబాద్ నగరం కేంద్రానికి గుర్తుకు రాదా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దిల్లీ- ముంబై పారిశ్రామిక కారిడార్ ((DMIC -Delhi Mumbai Industrial Corridor) పట్ల మోదీ సర్కార్ ను కేటీఆర్ నిలదీశారు.
దక్షిణ భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు మరియు చైన్నై నగరాలు లేవా? ఈ మూడు ప్రాంతాలను పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే అద్భుతాలు చేసి చూపుతాం, వారికంటే మెరుగైన ఫలితాలు తీసుకురాగలమని పేర్కొన్నారు. డిఫెన్స్ కారిడార్ ను కూడా హైదరాబాద్- బెంగళూరు మధ్య కాకుండా వేరేచోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆలోచనలు మారాలి, ఈ రకమైన ప్రవర్తన మంచిది కాదని కేటీఆర్ అన్నారు.
టీఎస్ ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక, కొత్త తరహా ఆలోచనలతో వస్తే ప్రోత్సహిస్తాం
టీఎస్ ఐపాస్ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మానసపుత్రిక అని కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక సంఘాలు, అధికారులతో సీఎం కేసీఆర్ ఒక రోజంతా చర్చించి. టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది. పర్యావరణహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్‌ను మారుస్తున్నాం. ఓఆర్‌ఆర్ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించాం. వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు.
కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు చెల్లిస్తామని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ఒక పరిశ్రమకు రాయితీ ఇస్తే వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. పరిశ్రమలకు రాయితీలు ఇస్తే పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నట్లు అపోహలు సృష్టించారు. చైనాతో పోటీ పడాలంటే సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో పాటు మెగా పార్కులు ఉండాలి. హైదరాబాద్ ఫార్మాసిటీని అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఫార్మా సిటీ కోసం 10 వేల ఎకరాలు సేకరించాం. ఎస్సీ, గిరిజన పారిశ్రామికవేత్తల రూ. 305 కోట్ల రాయితీలు అందజేశాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కార్మికులకు జీవనాధారం. మెగా పరిశ్రమలు 30 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈలు 70 శాతం వరకు ఉపాధిని కల్పిస్తున్నాయి. ప్రపంచంతో పోటీ పడాలంటే భారీ ప్రాజెక్టులు ఉండాల్సిందే. నిబద్ధతతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాం. పరిశ్రమల వద్దే ఉద్యోగుల నివాసాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.