Telangana Municipal Polls 2020: తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, భైంసాలో వెయ్యి మంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు, కొంపల్లిలో ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్

భైంసాలో 56 పోలింగ్ కేంద్రాల వద్ద 1000 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Hyderabad, January 22:  తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లకు బుధవారం పోలింగ్ (Telangana Municipal Polls 2020) ప్రారంభమైంది.  సుమారు 53 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం నుంచి ఇప్పటివరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలిస్తే మందకోడిగానే సాగుతున్నప్పటికీ మెల్లిమెల్లిగా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది.  11 గంటల సమయానికి సుమారు 35 శాతం పోలింగ్ నమోదైంది.  బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ సాగుతుంది. జనవరి 25 న ఫలితాలు ప్రకటించబడతాయి.

పోలింగ్ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగి రెడ్డి పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్క టెండర్ ఓటు నమోదైనా, రీపోలింగ్ నిర్వహిస్తామని ఇదివరకే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న భైంసా పట్టణంలో (Bhainsa Municipality) పరిస్థితి సాధారణమని, అక్కడ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. భైంసాలో 56 పోలింగ్ కేంద్రాల వద్ద 1000 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  7,961 పోలింగ్ కేంద్రాలలో 45,000 మంది సిబ్బంది ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షణ జరుగుతుందని ఎన్నికల కమీషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీ (Kompally Municipality)లో  ఫేస్ రికగ్నిషన్ యాప్  (Face Recognition App) ద్వారా ఓటర్లను గుర్తించే విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.  కొంపల్లి మునిసిపాలిటీలోని పోలింగ్ కేంద్రాల క్రమసంఖ్య 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31 మరియు 32లలో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఓటరు గుర్తించబడకపోయినా, ఓటర్ కార్డు, ఓటర్ లిస్టు ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతిని ఇస్తారు.

ఇక ఎన్నికల కమిషన్ అందించిన గణాంకాల ప్రకారం, దాదాపు  700కి పైగా వార్డుల్లో బీజేపీ,  400కి పైగా వార్డులలో కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టలేదని తెలిసింది.