Face Recognition Technology - Telangana Civic Polls 2020 | Photo: ANI/ Twitter

Hyderabad, January 20: దొంగ ఓట్లు వేయకుండా నకిలీ ఓటర్లను గుర్తించేందుకు  భారతదేశంలో మొట్ట మొదటిసారిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో (Telangana Civic Polls 2020)  'ఫేస్ రికగ్నిషన్' (Face Recognition) యాప్ ద్వారా ఓటర్ల గుర్తింపు విధానాన్ని ఎన్నికల సంఘం (TSEC) ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన 10 పోలింగ్ స్టేషన్లలో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది.

మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి మునిసిపాలిటీలో ఈ విధానం అమలు చేయనున్నట్లు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. కొంపల్లి మునిసిపాలిటీలోని పోలింగ్ కేంద్రాల క్రమసంఖ్య 13, 15, 16, 21, 22, 23, 24, 27, 31 మరియు 32లలో ఓటరు యొక్క ఫోటోను అదనపు పోలింగ్ అధికారి తనకు ఇవ్వబడిన ప్రత్యేక యాప్ గల మొబైల్ ద్వారా చిత్రీకరించి, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (TSTS) కు పంపుతారు. డేటాను సరిపోల్చుకొని అప్పటికప్పుడే ఓటరు గుర్తించబడినట్లు మెసేజ్ పంపుతారు.

అయితే ఒకవేళ ఈ టెక్నాలజీ ద్వారా ఓటరు గుర్తించబడకపోయినా, వారి ఓటరు కార్డు, ఓటర్ లిస్టు ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. ఇది కేవలం ఒక ప్రయోగం కోసమే, ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగు పరిచేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు, ఈ ప్రక్రియలో సేకరించిన ఓటర్ ఫోటో డేటా ఆ వెంటనే తొలగించబడుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణలోని 120 మునిసిపాలిటీలు, తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 22న పోలింగ్ జరుగుతుంది, ఫలితాలు జనవరి 25న ప్రకటించబడతాయి. అయితే, కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ కు మాత్రం జనవరి 25 న పోలింగ్ జరుగుతుంది, జనవరి 27న ఫలితాలు వెల్లడవుతాయి.  ఎన్నికలకు ముందే ఖాతా తెరిచిన టీఆర్ఎస్ పార్టీ

ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే విస్తృతమైన ప్రచారం నిర్వహించాయి. సోమవారంతో ప్రచారం ముగియనుంది.