L Ramana Quits TDP: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి, తెలుగుదేశం పార్టీకి ఎల్. రమణ రాజీనామా, టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
ఈటలకు పోటీగా బలమైన బీసీ నేతగా ఎల్ రమణ....
Hyderabad, July 9: తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు లేఖను పంపారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. ఇక మూడు దశాబ్దాలుగా తన రాజకీయ జీవితానికి సహకరించిన టిడిపికి, చంద్రబాబుకు రమణ ధన్యవాదాలు తెలిపారు.
గత కొంతకాలంగా ఎల్ రమణ టిడిపిని వీడి తెరాసలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి, రమణ కూడా తనకు తెరాస నుంచి ఆహ్వానాలు అందాయని ఆ వార్తలను ధృవీకరించారు. పార్టీ మారే విషయమై ఆయన తన అనుచరులతో సమాలోచనలు చేశారు. తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వీడటమే ఉత్తమమని ఎల్ రమణ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో గురువారం రాత్రి ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. వీరి భేటీకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిగాయి, ఎట్టకేలకు ఈరోజు రమణ టిడిపిని వీడారు.
Here's the announcement:
ఎల్ రమణకు తెరాస నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే ఇటీవల మాజీమంత్రి ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నికకు ఎల్ రమణను పోటీకి దించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఈటలకు పోటీగా బలమైన బీసీ నేతగా ఎల్ రమణ గట్టి పోటీ ఇస్తారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.