Telangana RTC Strike: కార్మికులు చనిపోతున్నా కేసీఆర్‌లో చలనం లేదు, ఎంపీని అని చూడకుండా పోలీసులు మెడపట్టి తొసేశారు, డ్రైవర్ బాబు అంతిమయాత్రలో ఉద్రిక్తత, హైకోర్టులో కేసు మరోసారి వాయిదా
ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించామని నివేదికలో పేర్కొన్నారు. ఈసారి కూడా నివేదిక అస్పష్టంగా ఉందని హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది....
Hyderabad, November 1: దాదాపు నెలరోజులుగా ఆర్టీసీ సమ్మె (TSRTC Strike) జరుగుతున్నా, ఆర్టీసీ కార్మికులు చనిపోతున్నా సీఎం కేసీఆర్ (CM KCR) లో చలనం రావడం లేదని కరీంనగర్ ఎంపీ, బీజేపి నాయకుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ సమ్మెలో పాల్గొని గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంత్యక్రియల సందర్భంగా కరీంనంగర్ (Karimnagar) లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ డిమాండ్ల పరిష్కారం దిశగా సీఎం కేసీఆర్ చర్చలు జరిపేంత వరకు బాబు అంత్యక్రియలు జరిపేది లేదని రెండు రోజులుగా కార్మికుడి మృతదేహంతోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. అయితే కుటుంబ సభ్యుల కోరిక మేరకు శుక్రవారం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
బాబు అంతిమయాత్రను ఆయన ఇంటి నుంచి కరీంనగర్ బస్ డిపో వైపు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ నాయకులు, వివిధ పార్టీల ప్రతినిధులు యత్నించగా పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఒక ఎంపీని అని చూడకుండా పోలీసులు తన గల్లా పట్టుకొని తోసేశారు. ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకా ఎలా ఉండాలి అని బిజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. అనంతరం బాబు అంతిమయాత్రను పోలీసులు నేరుగా ఆయన ఇంటి సమీపంలో ఉన్న స్మశానవాటిక వైపే మళ్లించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతిమయాత్రలో ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పలు పార్టీల నాయకులు, మంద కృష్ణ, ఆర్టీసీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. డ్రైవర్ బాబు కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం, డబుల్ బెడ్ రూం ఇల్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నిరంకుశత్వాన్ని వీడి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని మాజీ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాల ఆర్టీసీలలో 30 శాతం కేంద్ర వాటా ఉంటుందని, కేంద్రంలోని బేజేపీకి ఇక్కడి ఆర్టీసి సమ్మె కనిపించడం లేదా అని దుయ్యబట్టారు.
హైకోర్టు సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ, మరోసారి వాయిదా
ఈరోజు మరోసారి ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్ విచారణ జరిపింది. ఇంతకుముందు హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో, ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పూర్తి నివేదికను సమర్పించారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించామని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా నివేదిక అస్పష్టంగా ఉందని హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది, తప్పుడు లెక్కలతో అఫిడఫిట్ సమర్పించారని కోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్లీ స్పష్టమైన నివేదిక సమర్పించాల్సిందిగా తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది.