UP Election Results 2022: యోగీ దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలు, వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించనున్న యోగీ ఆదిత్యనాథ్
అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు (UP Election Results 2022) రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం బీజేపీకి కలిసొచ్చే అంశం. పంజాబ్ మినహా మిగతా రాష్ట్రాల్లోనూ తమ పార్టీకి సానుకూల ఫలితాలు (UP Election Results 2022) రావడంతో కమలనాథులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో ఉత్తర ప్రదేశ్‌లో ఐదేళ్ళ పదవీ కాలం పూర్తయిన తర్వాత తిరిగి అధికారం చేపట్టే మొదటి ముఖ్యమంత్రిగా యోగి రికార్డు (Yogi Adityanath Scripts History) సృష్టించనున్నారు. ఆ రాష్ట్రంలో 1985 తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి పార్టీగా బీజేపీ రికార్డు నిలవబోతోంది.
ఉత్తరప్రదేశ్‌లో 1952, మే 20న తొలి అసెంబ్లీ కొలువుదీరింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 70 ఏండ్లలో మొత్తం 21 మంది సీఎంలుగా పనిచేశారు. అయితే, ఈ 70 ఏండ్ల యూపీ ఎన్నికల చరిత్రలో ఐదేండ్ల పూర్తికాలం పదవిలో ఉండి, వరుసగా రెండోసారి తన పార్టీని అధికారంలోకి తెచ్చిన తొలి సీఎంగా యోగీ రికార్డు (Becomes First UP CM to Return for Second Term) సృష్టించాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి, గెలిచి, ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం 15 ఏళ్ళలో తొలిసారి అవుతుంది. అదే విధంగా నోయిడాలో పర్యటించి, ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకునే నేతగా కూడా ఆయన నిలవబోతున్నారు. నోయిడాలో పర్యటించిన ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారనే ప్రచారం గతంలో జరిగింది.
పంజాబ్‌లో వన్‌మ్యాన్ షో, హేమాహేమీలకు షాక్ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్, ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ, 89 స్థానాల్లో లీడింగ్‌లో ఆప్
ముఖ్యమంత్రిగా ఎన్నికలను ఎదుర్కొని వరుసగా రెండోసారి సీఎం పదవిలోకి వచ్చిన ఐదో వ్యక్తిగా కూడా యోగీ ఆదిత్యనాథ్ పేరిట రికార్డు నమోదు కాబోతున్నది. యోగీ కంటే ముందు 1957లో సంపూర్ణానంద, 1962లో చంద్రభాను గుప్తా, 1974లో హేమ్‌వతి నందన్ బహుగుణ, 1985లో నారాయణ్ దత్ తివారీ వరుసగా రెండోసారి సీఎంలు అయ్యారు. చివరిసారిగా 1985లో ఉమ్మడి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌డీ తివారీ వరుసగా రెండోసారి సీఎం పదవి చేపట్టాడు. ఆ తర్వాత ఈ 37 ఏండ్లలో ఎవరూ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పదవిలోకి రాలేదు. ఇన్నాళ్లకు ఇప్పుడు యోగీ ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
49 ఏళ్ళ యోగి ఆదిత్యనాథ్ మొదట్లో గోరఖ్‌పూర్ మఠానికి పరిమితమై ఉండేవారు. ఆయన ‘హిందూ హృదయ సామ్రాట్’ అని ఆయన మద్దతుదారులు అంటారు. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. అప్పటి బీజేపీ నేత మహంత్ అవైద్యనాథ్ శిష్యరికంలో రాజకీయాల్లో ఎదిగారు. తన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌నాథ్ మందిరం ప్రధాన అర్చకుడవుతారని అవైద్యనాథ్ ప్రకటించారు. అప్పటికి యోగి ఆదిత్యనాథ్ వయసు 22 సంవత్సరాలు. విశ్వవిద్యాలయంలో ఏబీవీపీలో చేరారు. 1998లో అవైద్యనాథ్ తన లోక్‌సభ స్థానాన్ని ఆదిత్యనాథ్‌కు ఇచ్చారు. 1998 నుంచి 2014 వరకు వరుసగా ఐదుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
2017 శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. మరికొన్ని నిర్ణయాలు ప్రజాదరణను తెచ్చిపెట్టాయి. 2022 శాసన సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ ప్రధాన ప్రచారకర్తగా మారారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గట్టిగా ప్రచారం చేశారు. ఆయనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఉత్తర ప్రదేశ్‌కు వెలుపల కూడా ఆదిత్యనాథ్ ప్రత్యేక ఆకర్షణను సంపాదించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. గత ఏడాది నవంబరులో ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక స్థానాన్ని సంపాదించారు.