Vellore Lok Sabha Result 2019: తీవ్ర ఉత్కంఠత రేపిన వెలూరు లోకసభ కౌంటింగ్. అధికార పార్టీ అభ్యర్థిపై, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కతిర్ ఆనంద్ 8 వేల ఓట్ల తేడాతో వెలూరు ఎంపీగా గెలుపు.

నోటాకు సుమారు 10 వేల ఓట్లు లభించాయి...

Vellore Lok Sabha Election Results 2019 | DMK Candidate Kathir Anand Declared Winner.

Tamil Nadu, Vellore. Aug 09:  తమిళనాడు రాష్ట్రంలోని వేలూర్ లోకసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే పార్టీ గెలుపొందింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి షణ్ముగంపై డీఎంకే పార్టీ అభ్యర్థి కతిర్ ఆనంద్ 8 వేల ఓట్ల పైగా తేడాతో విజయం సాధించారు.

ఈ ఏడాది ఏప్రిల్ 18న సార్వత్రిక ఎన్నికలతో పాటే వేలూరు స్థానానికి ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల సమయంలో ఇక్కడ భారీ మొత్తంలో డబ్బు పట్టుబడటంతో కేంద్ర ఎన్నికల సంఘం వేలూరు లోకసభ ఎన్నికను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తిరిగి ఆగష్టు 5న ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన ఈ ఎన్నికలో ప్రధాన పోటీ మాత్రం అధికార AIADMK మరియు ప్రతిపక్ష DMK పార్టీల మధ్యే నిలిచింది.

ఆగష్టు 9, శుక్రవారం రోజున కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ కౌంటింగ్ లో కూడా తీవ్ర ఉత్కంటగా సాగింది. ఊహించినట్లుగానే అధికార, ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య ఆధిక్యత పోటాపోటీగా సాగింది. తొలి రౌండ్లలో డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ పై అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగం 13 వేల ఓట్ల ఆధిక్యతను సాధించారు. అయితే రానురాను ట్రెండ్స్ మారుతూపోయాయి. డీఎంకే అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంటూ వచ్చారు, ఒక దశలో 26 వేల ఆధిక్యతను ప్రదర్శించారు. కానీ వరుస రౌండ్లలో ఆధిక్యత తగ్గుతూ పోయినా చివరకు విజయం ఆనంద్ వైపే మొగ్గు చూపింది. 8141 ఓట్ల తేడాతో కతిర్ ఆనంద్ వెలూర్ ఎంపీగా గెలుపొందారు.

ఈ ఎన్నికలో డీఎంకే అభ్యర్థి కతిర్ ఆనంద్ కు సుమారు 4.85 లక్షల ఓట్లు పోలవగా, అన్నాడీఎంకే అభ్యర్థి షణ్ముగంకు సుమారు 4.77 లక్షల వరకు పోలయ్యాయి. నోటాకు సుమారు 10 వేల ఓట్లు లభించాయి.



సంబంధిత వార్తలు