West Bengal Elections 2021: బీజేపీ హటావో...దేశ్ బచావో, బెంగాల్ ఎన్నికల్లో పిలుపునిచ్చిన మమతా బెనర్జీ, నందిగ్రామ్‌లో దీదీ క్లీన్‌బోల్డ్ అయ్యారని ప్రధాని మోదీ విమర్శ, బెంగాల్‌లో అధికారంలోకి వస్తే హింసకు తావు లేకుండా చేస్తామని తెలిపిన అమిత్ షా
బెంగాల్‌లో ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఓడిపోతామని కేంద్రంలోని బీజేపీకి తెలుసునని, అందుకునే వాళ్లు తుపాకులు తీస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
Kolkata, April 12: పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. టీఎంసీ-బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే నాలుగు దశలు ఎన్నికలు (West Bengal Assembly Elections 2021)పూర్తయిన పశ్చిమ బెంగాల్లో ఇంకా నాలుగు దశల్లో పోలింగ్ జరగ నుంది. నాలుగవ దశ ఎన్నికల్లో కుచ్ బెహార్ లో హింసాత్మక వాతావరణం చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో 5 మంది ప్రాణాలు కోల్పోగా మరి కొందరికి గాయాలయ్యాయి. దీనిపై అక్కడి రాజకీయ వాతావారణం వేడెక్కింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై 24 గంటల పాటు ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఆమె ఇటీవల ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా ఈసీ పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధ సమయంలో ఆమె ఏ రూపంలోనూ ప్రచారం చేయకూడదు.
రాష్ట్రంలోని ముస్లిం ఓటర్లంతా గంపగుత్తగా టీఎంసీకి ఓటు వేయాలని ఇటీవల ఎన్నికల ప్రచార సభలో మమత పిలుపునిచ్చారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆమె వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళికి విరుద్ధమంటూ ఆ ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ఈ అంశంపై మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ రెండు నోటీసులు కూడా ఇచ్చింది.
తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఈసీకి సమాధానమిచ్చిన మమతా బెనర్జీ.... ప్రధాని మోదీకి ఎందుకు నోటీసులివ్వలేదంటూ ఈసీని ప్రశ్నించారు. కాగా, మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంపై 24 గంటల పాటు ఈసీ నిషేధం విధించడంపై టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఈసీ పూర్తిగా రాజీపడే వైఖరి ప్రదర్శించింది' అని ఓ ట్వీట్‌లో ఆయన వ్యాఖ్యానించారు.
అయిదవ దశ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పెద్దలంతా బెంగాల్లో పాగా వేశారు. ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. బెంగాల్‌లోని వర్ధమాన్ నియోజకవర్గంలో పర్యటించిన ప్రధాని మోదీ (PM Modi) అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో క్లీన్‌బోల్డ్ అయ్యారని, నాలుగు దశల్లోనూ బీజేపీ సెంచరీ సాధించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
రానూ రానూ మమతలో కోపం పెరుగుతోందని ఎద్దేవా చేశారు. ఎందుకంటే నాలుగు దశల్లోనూ ప్రజలు టీఎంసీని పూర్తిగా తుడిచిపెట్టేసినందుకేనని మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలోనే తాము శోభా మజుందార్‌ను కోల్పోవాల్సి వచ్చిందని, ఆమెను తృణమూల్ గూండాలు క్రూరగా కొట్టారని, ఆ విషయాన్ని మాత్రం తాము ఎప్పటికీ మరిచిపోమని హెచ్చరించారు.
ఎన్నికల విధుల్లో భాగంగా ఓ నిజాయితీపరుడైన పోలీస్ అధికారి బెంగాల్‌కు వచ్చారని, ఆయనను కొందరు కొట్టి చంపారని అన్నారు. కుమారుడి శవాన్ని చూసి తల్లి కూడా మరణించిందని, ఆమె సీఎంకు తల్లి కాదా? అని మోదీ సూటిగా ప్రశ్నించారు. మా, మాటీ, మానూష్ పేరుతో దీదీ పదేళ్ల పాటు బెంగాల్‌ను పాలించారని, కానీ కొన్ని రోజుల పాటు ఎక్కడికి వెళ్లినా మోదీ.. మోదీ.. అంటున్నారని ఎద్దేవా చేశారు. పాలన పేరుతో దీదీ పదేళ్లుగా తీవ్ర గందరగోళాన్నే సృష్టించారని, చేసిందేమీ లేదని మండిపడ్డారు. అదేవిధంగా మా, మాటి, మానుష్ నినాదాన్ని విమర్శిస్తూ కొత్త అర్ధాన్ని చెప్పుకొచ్చారు. మా అంటే హింసించడమని, మాటీ అంటే దోచుకోవడమని, మనుష్ అంటే రక్తపాతమని అర్థమని మోదీ ఎద్దేవా చేశారు.
రాజకీయాల నుంచి వారిని నిషేధించే బిల్లు పెడతాం : దీదీ
కాల్పులు, షూటింగ్‌లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని రాజకీయాల నుంచి నిషేధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో తాను ప్రవేశపెడతానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. డుమ్ డుమ్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 'బీజేపీ నిస్సగ్గుగా వ్యవహరిస్తోంది. నలుగురు వ్యక్తులను చంపిన తర్వాత కూడా మరో నాలుగు రౌండ్లు కాల్పులు జరపి ఉండాల్సిందంటూ వాళ్లు మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ ఇలాగేనా మాట్లేడేది? మనం రాజకీయాల్లో ఉన్నాం. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఎలాంటి దేశంలో మనం జీవిస్తున్నాం. వీళ్లని బెంగాల్ ప్రజలని చెప్పుడానికి కూడా సిగ్గుగా ఉంది. వాళ్లని అరెస్టు చేసి, రాజకీయాల నుంచి నిషేధించాలి' అని మమత నిప్పులు చెరిగారు.
'అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టమని సౌగత్ దా (టీఎంసీ నేత సౌగత్ రాయ్)ని అడుగుతాను. హింసాత్మక వ్యాఖ్యలు చేసే వాళ్లను, 'గోలీ మార్‌దో' నినాదాలిచ్చే వారిని రాజకీయాల్లోంచి నిషేధించాలి' అని మమత అన్నారు. బీజేపీ మాటలు వినవద్దని, నిషాక్షికంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌ను మమత కోరారు. ప్రధాని మోదీపై మమత తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. 'నేను నిజంగానే విచారపడుతున్నాను. సిగ్గుపడుతున్నాను. మాట్లాడేటప్పుడు హద్దులు చూసుకోకుండా మాట్లాడే ఇలాంటి ప్రధానిని నేనెప్పుడూ చూడలేదు. అన్ని మతాల వారి గురించి నేను పనిచేశాను. నేను చేయనిదేమిటి? ఒక్కటి మాత్రమే ఇప్పుడు మిగిలింది. బీజేపీ హటావో...దేశ్ బచావో' అని మమత పిలుపునిచ్చారు.
'ట్రంప్ కార్డ్' వినిపించేందుకు మోదీ అమెరికా వెళ్లారని, ఆ తర్వాత బెంగాల్ కార్డ్ జపంతో బంగ్లాదేశ్ వెళ్లారని అన్నారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఏజెంట్లని మమత విమర్శించారు. దీనికి ముందు, మమతా బెనర్జీ ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలపై బహిరంగ యుద్ధం ప్రకటించారని ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ విమర్శించారు. ఆ కొద్దిసేపటికే మమత ఆయనపై ప్రతివిమర్శలు గుప్పించారు.
ఓడిపోతామని వాళ్లు తుఫాకులు తీస్తున్నారు : మమతా బెనర్జీ
బెంగాల్‌లో ఇంతవరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్‌లో ఓడిపోతామని కేంద్రంలోని బీజేపీకి తెలుసునని, అందుకునే వాళ్లు తుపాకులు తీస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఆ బుల్లెట్లకు బ్యాలెట్ ద్వారా తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. జల్‌పాయ్‌గురిలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, తానొక 'రాయల్ టైగర్'నని, తనను కూచ్ బెహర్ వెళ్లకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. కాల్పుల ఘటనలో మృతుల కుటుంబాలతో జల్‌పాయ్‌గురి నుంచే తాను వీడియో కాల్‌లో మాట్లాడాడని తెలిపారు. 'నేను ఈనెల 14న మిమ్మల్ని కలుస్తాను' అని వీడియో కాల్‌లో మృతుల కుటుంబ సభ్యులకు సీఎం భరోసా ఇచ్చారు.
ప్రధానికి, హోం మంత్రికి పాలించే సత్తా లేదని మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. బెంగాల్‌ను కైవసం చేసుకునేందుకు ప్రతిరోజూ వాళ్లు వచ్చిపోతున్నారని చెప్పారు. 'మీరు రావచ్చు. ఎవరూ మిమ్మల్ని ఆపరు. కానీ మీరు ప్రజలు సంతోషంగా ఉండేలా చేయండి, కానీ బెదిరించొద్దు. కేంద్ర బలగాలతో ప్రజలను చంపుతున్నారు, ఆ తర్వాత బలగాలకు క్లీన్ చిట్ ఇస్తున్నారు' అంటూ బీజేపీ కేంద్ర నేతలపై మమత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూచ్ బెహర్ ఘటనను 'సామూహిక హత్యాకాండ'గా సీఎం అభివర్ణించారు. వాళ్లు బుల్లెట్లు విచ్చలవిడిగా కాల్చారని, కాళ్లపై, శరీరంలోని దిగువభాగంపై కాల్పులు జరిపి ఉండొచ్చని, కానీ బుల్లెట్లు ప్రజల మెడల్లోకి, ఛాతీల్లోకి వెళ్లిపోయాయని మమత వివరించారు.
ఎన్నార్సీ అమలు చేయడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు : అమిత్‌షా
ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గూర్ఖాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్నార్సీ అమలు చేయడం వల్ల గూర్ఖాలకు ఇబ్బందులు తలెత్తుతాయని అధికార తృణమూల్ లేనిపోని ప్రచారం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ గూర్ఖాలకు ఎలాంటి ప్రమాదమూ లేదని భరోసా ఇచ్చారు. ‘‘ఇప్పటి వరకైతే ఎన్నార్సీని అమలు చేయలేదు. చేసే సమయంలో ఏ గూర్ఖాని కూడా దేశం విడిచి వెళ్లమని ఆదేశించం. ఈ విషయంలో తృణమూల్ అసత్యాన్ని ప్రచారం చేస్తోంది. వారిలో భయాన్ని పెంచుతోంది’’ అంటూ షా విరుచుకుపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో సీఎం మమత బెంగాల్ కంటే తన పేరునే ఎక్కువ సార్లు ప్రస్తావిస్తూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని పదే పదే డిమాండ్లు చేస్తున్నారని, బెంగాల్ ప్రజలు చెబితే తప్పకుండా రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. అయితే ముఖ్యమంత్రి పదవికి మే 2 న రాజీనామా చేసేందుకు మాత్రం దీదీ సిద్ధంగా ఉండాలని కౌంటర్ ఇచ్చారు. అనవసరంగా, అసందర్భంగా సీఎం మమత బీజేపీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఒక్క సీతల్‌కుచి (కూచ్ బెహర్) ఘటన మినహా పశ్చిమబెంగాల్‌లో ఇంతవరకూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే రాజకీయ, ఎన్నికల సంబంధిత హింసకు తావు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సందర్భంగా శాంతిపూర్‌లోని నడియా జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మమతా బెనర్జీ నలుగురు మృతులకు (కాల్పుల మృతులకు) మాత్రమే సంతాపం తెలుపుతున్నారని, ఐదో వ్యక్తి అయిన ఆనంద్ బర్మన్ కోసం ఒక్క కన్నీటి బొట్టు కూడా విడవడం లేదని అమిత్‌షా విమర్శించారు.
ఆనంద్ బర్మన్ రాజ్‌వంశీ కులస్థుడు కావడమే కారణమని ఆయన అన్నారు. బుజ్జగింపు రాజకీయాలు ఆనంద్ బర్మన్‌కు తెలియవన్నారు. ఆనంద్ బర్మన్ పేరు ప్రస్తావించని మమతాబెనర్జీ బెంగాల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ తరహా రాజకీయాలు బెంగాల్ సంస్కృతి కాదని అమిత్‌షా పేర్కొన్నారు.
తమ పార్టీ విజయం సాధిస్తుంది : జేపీ నడ్డా
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రల్లోనూ తమ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పశ్చిమబెంగాల్‌లో తదుపరి ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని, అసోంలో పాలన కొనసాగిస్తామని, తమిళనాడులోని అధికార కూటమిలో కీలకంగా ఉంటామని చెప్పారు. పుదుచ్చేరిలో అధికారంలోకి రావడంతో పాటు, కేరళలో కీలక శక్తిగా నిలుస్తామని ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి...ఇలా ఎన్నికలు ఏవైనా బీజేపీ ఒకేలా పోరాడుతుందని, తమ వాదనను ప్రజల ముందుకు బలంగా తీసుకువెళ్తుందని చెప్పారు.
బెంగాల్‌లో తమ ఓటమిని టీఎంసీ ఇప్పటికే ఒప్పుకుందని నడ్డా వ్యాఖ్యానించారు. కూచ్ బెహర్ ఘటనపై ఆయన మాట్లాడుతూ, ఆరోజు ఉదయం 7.30 గంటలకు ఆనంద్ బర్మన్ అనే కార్యకర్త ఓటు వేసేందుకు లైనులో నిలబడినప్పుడు అతనిపై కాల్పులు జరపడంతో అతను చనిపోయాడని, ఆ తర్వాత టీఎంసీ వర్కర్లు 'క్విక్ రెస్పాన్స్ టీమ్' ఆయుధాలను ఎత్తుకెళ్లాలని ప్రయత్నించారని అన్నారు.
నేరస్థులతో ప్రభుత్వం కుమ్మక్కవడం వల్లే బెంగాల్ హింస చోటుచేసుకుందనే విషయం నిరూపితమైందని అన్నారు. ''బెంగాల్‌లో మాత్రమే హింసా ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నదెవరు? హోం మంత్రి ఎవరు? రాష్ట్ర శాంతిభద్రతల ఇన్‌చార్జిగా ఎవరున్నారు? వీటిన్నింటికి సమాధానం ఎవరు చెబుతారు?'' అని నడ్డా పరోక్షంగా మమతను ఉద్దేశించి ప్రశ్నించారు.
దుర్గాపూజ, సరస్వతి పూజలను టీఎంసీ ఆపిందని, రామజన్మభూమి ఆలయం భూమి పూజ రోజున కర్ఫూ విధించిందని, ఈ విషయాలను ఎవరు మరిచిపోగలరని నడ్డా ప్రశ్నించారు. బయట వాళ్లు బెంగాల్ వస్తున్నారంటూ మమత వ్యాఖ్యానించడం భారత రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీని కార్తకర్త, కార్యకర్తను పార్టీ నమ్మే స్థితి లేదని ఆ పార్టీపై నడ్డా విసుర్లు విసిరారు.
ఓటమి భయంతోనే తీవ్ర నిరాశలో ఉన్నారు : బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే తీవ్ర నిరాశలో ఉన్నారని, అందుకే హింసకు ప్రేరేపిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు. రెండ్రోజుల క్రితం కూచ్ బెహార్‌లో హింస చెలరేగడంపై ఆయన సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, హింసకు తావులేని వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. అయితే, దురదృష్టవశాత్తూ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం మమత చేస్తున్నారని ఆరోపించారు. హింసకు పాల్పడే వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ ఘటనలతో ఒక్కటి మాత్రం స్పష్టం అవుతోందని, తృణమూల్ కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోనుందని జోస్యం చెప్పారు.
'ఓటమి భయం టీఎంసీని పట్టుకుంది. అందుకే నానా హంగామా చేస్తోంది. ఎన్నికలు కోల్పోయిన తర్వాత ఆమె ఏ డిప్రెషన్‌లో జారుకుంటారో తెలియదు. ఆమె తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నాం' అని నఖ్వి అన్నారు. కేవలం నిరాశతోనే మమతా బెనర్జీ ఎలా పడితే అలా, ఎవరిని పడితే అలా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఒకసారి ఎన్నికల కమిషన్‌ను, మరోసారి భద్రతా బలగాలను, ఇంకోసారి బీజేపీని, ప్రధానిని, హోం మంత్రిని నిందిస్తూ మాట్లాడుతున్నారని విమర్శించారు. గెలుస్తామని మమతకు నమ్మకం ఉంటే ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాలన్నారు. పశ్చిమబెంగాల్ ప్రజలపై ఆమెకు అంత నమ్మకం ఉంటే ఇంత రచ్చచేయాల్సిన అవసరం లేదని, మే 2న ఎలాగూ ఫలితాలు స్పష్టమవుతాయని నఖ్వి అన్నారు.
ఈసీ అదేశాల మేరకే బలగాలు పనిచేస్తాయి: సీఆర్‌పీఎఫ్ డీజీ
ఎన్నికల కమిషన్ అదేశాలకు అనుగుణంగానే పారామిలటరీ బలగాలు పనిచేస్తుంటాయని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ సోమవారంనాడు వివరణ ఇచ్చారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపణల నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. 'రాజకీయ పార్టీలు ఏమి చెప్పాయనే దానిపై నేను వ్యాఖ్యానించను. పారామిలటరీ బలగాలు, ఆయా రాష్ట్ర ప్రజల బాధ్యత ఈసీదే. ఈసీ ఆదేశాలకు అనుగుణంగానే పారామిలటరీ బలగాలు పనిచేస్తాయని నేను నిశ్చయంగా చెప్పగలను' అని కుల్దీప్ అన్నారు.
ఈనెల 10న నాలుగో విడత పోలింగ్ సమయంలో సీతల్‌కుచిలో బలగాల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రధాన కుట్రదారు అమిత్‌షానే అంటూ మమతా బెనర్జీ ఆరోపించారు. హోం మంత్రి రాజీనామా చేయాలన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి తెలిసినందునే బెంగాల్‌లో హింసను ప్రేరేపిస్తోందని అన్నారు. కేంద్ర బలగాలను తాను నిందించలేనని, హోం మంత్రి ఆదేశాలకు అనుగుణంగానే వారు పనిచేస్తున్నారని అన్నారు.
మమత ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. ప్రజలకు రక్షణగా పోలింగ్ బూత్‌ల వద్ద పహారా కాస్తున్న కేంద్ర బలగాలపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. అమిత్‌షా స్పందిస్తూ, రాజీనామా చేయాల్సింది తాను కాదని, ప్రజలు చెబితే చేస్తానని, మే 2న మమతనే రాజీనామా చేయాల్సి ఉంటుందని పరోక్షంగా బీజేపీ విజయంపై ఆయన ధీమా వ్యక్తం చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)