EVMs (Photo Credits: PTI)

Kolkata, April 11: పశ్చిమ బెంగాల్‌లో శనివారం నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మూడు దశల పోలింగ్‌ ప్రశాంతంగా జరగ్గా ఈ నాలుగో దశ (West Bengal Elections 2021 Phase 4) హింసాత్మకంగా మారింది. కుచ్‌బిహర్‌లో కాల్పులు జరిగి మొత్తం ఐదుగురు మృతి చెందారు. అలాగే పలుచోట్ల చెదురుముదురు ఘటనలు జరిగాయి.మొత్తం 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (West Bengal Assembly Elections 2021) జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది.

15,940 పోలింగ్‌ కేంద్రాల్లో జనం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర బలగాలను, పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తున్నారన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరోపణలపై ఈసీ స్పందించింది. ప్రిసైడింగ్‌ అధికారి సూచిస్తే తప్ప పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లొద్దని కేంద్ర బలగాలకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొంది. కూచ్‌బెహార్‌ జిల్లాలో అశాంతి తలెత్తకుండా రాజకీయ నాయకుల ప్రవేశంపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాబోయే 72 గంటల వరకూ ఎవరూ జిల్లాలో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఐదో దశ ఎన్నికల్లో ‘సైలెన్స్‌ పీరియడ్‌’ను 48 గంటల నుంచి 72 గంటలకు పెంచింది. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది.

నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూచ్‌బెహార్‌ జిల్లా సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలోని మాతాభంగా పోలింగ్‌ కేంద్రం వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు కాల్పులు జరిగాయి. ఎన్నికల విధుల్లో ఉన్న కేంద్ర బలగాల నుంచి తుపాకులు లాక్కొనేందుకు స్థానికులు ప్రయత్నించారని, దాడికి దిగారని పోలీసు అధికారులు చెప్పారు. ఆత్మరక్షణ కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.

అసోంలోని నాలుగు పోలింగ్ స్టేషన్లలో 20న రీపోలింగ్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం, ర‌త‌బారి, సొనాయ్‌, హ‌ఫ్లాంగ్ నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాలుగు పోలింగ్ బూత్‌ల‌లో రీపోలింగ్‌కు ఆదేశాలు

మృతులు తమ పార్టీ మద్దతుదారులని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.ఇక కూచ్‌బెహార్‌ జిల్లాలో సితాల్‌కుచీ నియోజకవర్గం పరిధిలో శనివారం ఉదయం మరో దారుణం చోటుచేసుకుంది. మొదటిసారి ఓటు వేసేందుకు వచ్చిన ఆనంద బర్మన్‌(18)ను పఠాన్‌తులీలో 85వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌ బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో బర్మన్‌ మరణించాడు.

ఎన్నికల సందర్భంగా బెంగాల్‌లో పలు చోట్ల టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దిన్హతా నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి ఉదయన్‌ గుహపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఆయన గాయాలపాలయ్యారు. బెహలా పూర్బా స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి పాయల్‌ సర్కారు కారుపై అల్లరి మూక దాడికి పాల్పడింది. వారి బారి నుంచి ఆమె క్షేమంగా తప్పించుకున్నారు. బీజేపీ ఎంపీ లాకెట్‌ చటర్జీపైనా టీఎంసీ మద్దతుదారులు దాడికి దిగారు. హుగ్లీ జిల్లాలోని చుచురాలో ఆమె కారును ధ్వంసం చేశారు.

హౌరా జిల్లాలోని బాల్లీలో బీజేపీ అభ్యర్థి బైశాలీ దాల్మియా కాన్వాయ్‌పై టీఎంసీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. ఒక వాహనాన్ని ధ్వంసం చేశారు. కోల్‌కతాలో బీజేపీ అభ్యర్థి ఇంద్రనీల్‌ ఖాన్‌ను టీఎంసీ శ్రేణులు ఘెరావ్‌ చేశాయి. జాదవ్‌పూర్‌లో సీపీఎం ఏజెంట్‌పై కొందరు దుండగులు కారం పొడి చల్లి దాడి చేశారు. బంగోర్‌ నియోజకవర్గంలో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్, టీఎంసీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది.

వైయస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేనని తెలిపిన ఏపీ సీఎం, తిరుపతి ప్రజలకు బహిరంగ లేఖ

బెంగాల్‌లో మరో నాలుగు దశల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. శనివారం కూచ్‌బెహార్‌ జిల్లాలో మూడో దశ ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకోవడం, అయిదుగురు మరణించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమయ్యింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూసేందుకు బెంగాల్‌కు అదనంగా 71 కంపెనీల కేంద్ర బలగాలను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం 1,000 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నాయి.

మమతా బెనర్జీపై మండిపడిన ప్రధాని మోదీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పశ్చిమ బెంగాల్‌ను హింసాత్మకంగా మారుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కూచ్‌బెహార్‌ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఆయన శనివారం బెంగాల్‌ రాష్ట్రం నాడియా జిల్లాలోని సిలిగురి, కృష్ణానగర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను రెచ్చగొట్టి కేంద్ర బలగాలపైకి ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నెగ్గడానికి రక్తపాతం సృష్టించి, రిగ్గింగ్‌ చేసుకోవాలన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ కుట్రలతోనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు.

కూచ్‌బెహార్‌ ఘటన దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బెంగాల్‌లో బీజేపీకి ప్రజాదరణ పెరగడం చూసి మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు భరించలేకపోతున్నారని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఆక్రోశం పట్టలేకపోతున్నారని, అందుకే భద్రతా సిబ్బందిపై దాడి చేయాలంటూ జనానికి నూరిపోస్తున్నారని విమర్శించారు. మళ్లీ కుర్చీ దక్కకుండా పోతోందన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

రిగ్గింగ్‌కు అడ్డుగా ఉన్నాయన్న కారణంతోనే కేంద్ర బలగాలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దీదీ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. ఆమె గద్దె దిగక తప్పదని తేల్చిచెప్పారు. బెంగాల్‌లో తాము అధికారంలోకి రాగానే లంచాల సంస్కృతికి చరమ గీతం పాడుతామన్నారు. మూడు టీలకు(టీ, టూరిజం, టింబర్‌) మాఫియా చెర విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ నుంచి బెంగాల్‌లో ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వమే తీసుకుంటుందని, దోపిడీదార్లు కాదని మోదీ స్పష్టం చేశారు.