Tirupati, April 10: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం (AP CM YS Jagan) పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. ‘‘నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు.
తిరుపతి సభకు (tirupati-election-campaign) నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా. ప్రతి కుటుంబానికి కలిగిన లబ్ధికి సంబంధించిన వివరాలతో.. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా.
మీ అందరి కుటుంబాల శ్రేయస్సు దృష్ట్యా నేను రాలేకపోయినా.. 22 నెలల్లో మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది.. గతంలో వచ్చిన 2.28 లక్షల కన్నా ఎక్కువ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించాలి. డా.గురుమూర్తికి ఓటు వేయాలని రాసిన ఉత్తరం మీకు చేరిందని భావిస్తున్నా. డా.గురుమూర్తిని ఈ ఉప ఎన్నికలో (Tirupati Parliament By Election) తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నానని’’ లేఖలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మేలును వివరిస్తూ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు స్వయంగా లేఖలు రాసిన సంగతి విదితమే. తన 21 నెలల పరిపాలనలో ప్రభుత్వ పథకాలు, చేపట్టిన కార్యక్రమాలను, వాటి ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖలో పొందుపరిచారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ప్రతి కుటుంబంలోని సోదరుడు లేదా అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి నేరుగా ఆయన ఈ లేఖ రాశారు.
వైఎస్సార్ సున్నావడ్డీ.. వైఎస్సార్ ఆసరా, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు వంటి పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు కలిగిన లబ్ధిని ఈ లేఖల్లో పేర్కొన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలు, రైతులు, అక్కచెల్లెమ్మలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, అభివృద్ధి పనులు, గ్రామాలు, నగరాలు తదితర అంశాలను జగన్ తన లేఖలో ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీల మీద ఎలాంటి విమర్శలు చేయకుండా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వ దార్శనికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని ప్రజలకు తెలియజెప్పారు.
గత రాజకీయ సంస్కృతికి భిన్నంగా వైఎస్ జగన్ లేఖ సాగడం విశేషం. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటువేసి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని తిరుపతి లోక్‌సభ ఓటర్లను జగన్ కోరారు. పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఉన్న ఈ లేఖలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ప్రతి కుటుంబానికి అందజేయనున్నాయి.