New Delhi, April 10: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్‌లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీచేసింది. రతబారి, సొనాయ్, హఫ్లాంగ్ నియోజకవర్గాల్లోని నాలుగు పోలింగ్ బూత్‌లలో రెండో విడుత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 1 పోలింగ్ జరిగింది. అయితే, ఆయా బూత్‌లలో పోలింగ్ సరళి సక్రమంగా సాగకపోవడంతో ఎన్నికల సంఘం రీపోలింగ్‌కు ఆదేశించింది.
ఏప్రిల్ 20న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఈసీ సూచించింది. రతబారి నియోజకవర్గంలోని 149వ నంబర్ పోలింగ్ బూత్‌లో పరిధిలో బీజేపీ అభ్యర్థి భార్య కారులో ఈవీఎం ప్రత్యక్షమవడంతో టీఎంసీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
హఫ్లాంగ్ నియోజకవర్గం పరిధిలోని 107వ నంబర్ పోలింగ్ బూత్‌లో మొత్తం 90 ఓట్లకుగాను 171 ఓట్లు పోలయ్యాయి. సొనాయ్ నియోజకవర్గం పరధిలోని 463వ నంబర్ పోలింగ్ బూత్ పరిధిలో కాల్పులు జరిగి ముగ్గురుకి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయా బూత్‌లలో కూడా రీపోలింగ్ అనివార్యమైంది.