Telangana Budget Session 2021: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా, ముగిసిన బీఏసీ సమావేశం, ఈ నెల 26 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మార్చి 18న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేసీఆర్ సర్కారు
ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ వివరించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభను (Telangana Budget Session 2021) రేపటికి వాయిదా వేశారు
Hyderabad, Mar 15: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాష్ర్ట ప్రభుత్వం సాధించిన ప్రగతిని గవర్నర్ వివరించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభను (Telangana Budget Session 2021) రేపటికి వాయిదా వేశారు. రేపు సభలో సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చను 17న చేపట్టనున్నారు. 18న బడ్జెట్‌ను (Telangana Budget) ప్రవేశపెట్టి, 20వ తేదీ నుంచి చర్చ చేపట్టనున్నారు.
గవర్నర్ ప్రసంగం గంటన్నరకు పైగా కొనసాగింది. ఉదయం 11 :05 గంటలకు ప్రారంభమైన ప్రసంగం.. 12:15 గంటలకు ముగిసింది. ప్రసంగం ముగిసిన అనంతరం గవర్నర్‌తో పాటు సభ్యులందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. సభా మందిరంలోకి గవర్నర్ ఎర్ర తివాచీపై నడుచుకుంటూ వెళ్లారు.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి హరీష్ రావుతో పాటు ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు దివంగత సభ్యులకు సభ సంతాపం తెలుపనుంది.
17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సమాధానం ఇవ్వనున్నారు. 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 19, 21 తేదీల్లో శాసనసభ సమావేశాలకు సెలవులు ప్రకటించారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. ఈ నెల 23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. 26వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు.