Telangana Irrigation: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వనించనున్న రాష్ట్ర ప్రభుత్వం, నీటి పారుదల శాఖలో ఖాళీల భర్తీకి ఆదేశం, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు....

Telangana CM KCR | File Photo

Hyderabad, May 26:  నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డికి అప్పగించారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ఏ లిప్టు కాలిప్టు ప్రకారం అంచనాలను వేరు వేరుగా తయారు చేసి అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ శాఖాధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వానకాలం సీజన్ ప్రారంభంకాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా ఉన్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం సూచించారు. ఇప్పటికే కాళేశ్వరం నీటితో 90 శాతం చెరువులు, కుంటలు నిండి ఉండటంతో భూగర్భ జలాలు పెరిగాయని తద్వారా బోర్లల్లో నీరు పుష్కలంగా లభిస్తున్ననేపథ్యంలో రైతులు వరిపంట విస్తృతంగా పండిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందని, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు ఉంటారు. కాబట్టి వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు.

కృష్ణాబేసిన్ లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి, వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మత్తులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘వేల కోట్లు ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం. వాటిని వ్యూహాత్మకంగా రైతు సంక్షేమానికి వినియోగించే విధానాలను అవలంబించాలి. ప్రాణహితలో నీటి లభ్యతను అది ప్రవహించేతీరును అర్థం చేసుకోవాలి. ప్రాణహిత ప్రవాహం జూన్ 20 తర్వాత ఉధృతంగా మారుతుంది. అప్పడు వచ్చిన నీరును వచ్చినట్టే ఎత్తిపోసి కాళేశ్వరం రాడార్లో వున్న చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపుకోవాలి. కాల్వల మరమ్మతులు కొద్దిపాటి కొరవలు మిగిలి ఉన్నాయి. వాటిని సత్వరమే పూర్తి చేసుకొని, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేపట్టాలి. కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.

మొదటి దశ కరోనా కష్టకాలంలో రైతు పండించిన పంట ద్వారా 17శాతం ఆదాయం అందించి రాష్ట్ర జీఎస్.డి.పి.లో తెలంగాణ వ్యవసాయం భాగస్వామ్యం పంచుకున్నది. రాష్ట్ర రెవెన్యూకు తెలంగాణ వ్యవసాయం వెన్నుదన్నుగా నిలిచే పరిస్థితికి నేడు తెలంగాణ అభివృద్ధి చెందింది. నేడు తెలంగాణ వ్యవసాయం దేశాన్నే ఆశ్చర్యపరిచే స్థాయికి చేరుకున్నది. ఈ విషయాలను లోతుగా అధికారులు అర్థం చేసుకుంటూ సాగునీటి రంగాన్ని మరింత విజ్ఞతతో ముందుకు నడిపించాలి.’’ అని సీఎం అన్నారు.

ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి చివరి ఆయకట్టు దాకా నీటికొరత లేకుండా చేశామన్నారు. హుస్నాబాద్, పాత మెదక్, ఆలేరు, భువనగిరి, జనగామలకు మల్లన్న సాగర్ వరంలా మారనున్నదని సీఎం తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందనీ, దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు సూచించారు.

కాల్వల మరమ్మత్తు తదితర అవసరాల కోసం ఇరిగేషన్ అధికారుల వద్ద రూ. 700 కోట్లు కేటాయించామన్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇటీవల శంఖుస్థాపన చేసిన నెలికల్లు లిప్టుకు 24 వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం వున్న నేపథ్యంలో పాత టెండర్ ను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని సీఎం అన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సదర్ మాట్ బ్యారేజీ నిర్మాణం పనుల పురోగతిని సీఎం ఆరా తీసారు.

ఒక్క ఖాళీ కూడా ఉండొద్దు.. ఉద్యోగాల భర్తీ చేపట్టండి :

నిరంతరం లెవ్ లో, డైనమిక్ గా ఉండే ఇరిగేషన్ శాఖలో ఒక్కరోజు కూడా ఏ పోస్టు కూడా ఖాళీగా ఉండరాదని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు అర్హులకు ప్రమోషన్లు ఇస్తూ ఖాళీలను వెంట వెంటనే భర్తీ చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖకున్న ప్రత్యేకావసరాల దృష్ట్యా నియామక ప్రక్రియను బోర్డు ద్వారా స్వంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేస్తామని సీఎం అన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఖాళీల నివేదికను తనకు తక్షణమే అందజేయాలని సీఎం ఈఎన్సీ మురళీధర్ రావును ఆదేశించారు. కాల్వల నిర్వహణ కోసం త్వరలో లష్కర్లు, జేఈల నియామకాన్ని చేపడుతామని సీఎం తెలిపారు.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now