Ramappa Temple: కాకతీయ శిల్పా కళావైభవం.. రామప్ప దేవాలయానికి అరుదైన గౌరవం! ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన యునెస్కో, హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్
ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు....
Warangal, July 26: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయ ఖ్యాతి ఎల్లలు దాటింది. కాకతీయుల అద్భుత శిల్పకళా వైభవాన్ని రంగరించుకున్న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా గల వారసత్వ కట్టడాల పరిశీలనలకు ఉద్దేశించబడిన యునెస్కో హెరిటేజ్ కమిటీకి సంబంధించిన 44వ సమావేశం ఆదివారం నాడు చైనాలో జరిగింది. ఇందులో రామప్పకు 'వరల్డ్ హెరిటేజ్ సైట్- 2020' హోదాను కట్టబెట్టింది. తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప దేవాలయం రికార్డులకెక్కింది. రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు యునెస్కో వెల్లడించింది. ఇంజనీరింగ్, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక భారత కట్టడం మాత్రమే కాక ప్రపంచ స్థాయి కట్టడమంటూ యునెస్కో పేర్కొంది. 2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా భారత్ నుంచి గుజరాత్‌లోని ధోలవీర ఆలయం పోటీలో ఉంది.
కాకతీయ వంశీకుల రాజధానియైన వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. పాలంపేట చారిత్రత్మాక గ్రామం. కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించారు. ఇది తెలంగాణలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం, రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
కాకతీయ రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఖ్యాతి లభించినందుకు దేశప్రజలందరికి, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. దివ్యమైనటువంటి రామప్ప దేవాలయాన్ని సందర్శించి, ఆ దేవాలయం గొప్పదనాన్ని తెలుసుకోవాలంటూ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Here's PM's Tweet:
చారిత్రక రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా (వరల్డ్ హెరిటేజ్ సైట్) యునెస్కో గుర్తించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్ప కళా నైపుణ్యంతో తెలంగాణలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే ప్రత్యేకమైనదన్నారు. స్వయం పాలనలో కూడా తెలంగాణ చారిత్రక వైభవానికి, ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వ వైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం అన్నారు. కాకతీయ రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్పను, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కోసం మద్దతు తెలిపిన యునెస్కో సభ్యత్వ దేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కృషి చేసిన తెలంగాణ ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాధికారులను సీఎం అభినందించారు.