Engineers' Day 2021: మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినమే ఇంజనీర్ల దినోత్సవము, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించిన భరతజాతి ముద్దు బిడ్డ జీవిత చరిత్ర మీకోసం
ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు.
ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒకరు. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిశలా చాటారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి, ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు. ఆయన మార్గదర్శకత్వంలో నిర్మాణాలు నేటికీ అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదు. భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన ఆయన జయంతి (Mokshagundam Visvesvaraya Jayanti) (సెప్టెంబరు 15)ని దేశవ్యాప్తంగా 'ఇంజినీర్స్ డే' గా (Engineers' Day 2021) జరుపుకుంటారు. భారత రత్న విశ్వేశ్వరయ్య (Mokshagundam Visvesvaraya ) జీవితం ఓ సారి చూస్తే..
1861వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ లోని ముద్దెనహళ్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు దాదాపు 300 యేండ్ల క్రితం ఒకప్పటి కర్నూల్ జిల్లా, ప్రస్థుతం ప్రకాశం జిల్లా గిద్దలూరులోని 'మోక్ష గుండం'' అనే గ్రామం నుంచి అప్పటి మైసూరు రాజ్యానికి వలస వెళ్లారు. బెంగళూరు నగరానికి 38 మైళ్ళ దూరంలో ఉన్న ముద్దనహళ్ళిలో స్థిరపడిన సామాన్య మధ్యతరగతి కుటుంబంలో శ్రీనివాసశాస్త్రి వెంకటమ్మ దంపతుల సంతానమే విశ్వేశ్వరయ్య. ఆయన 1861 సెప్టెంబరు 15న జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యులు. సంస్కృత పండితుడు, హిందూ ధర్మశాస్త్ర పారంగతుడు. విశ్వేశ్వరయ్య జీవితంపై తల్లి ప్రభావం ఎక్కువగా ఉండేది.
విశ్వేశ్వరయ్య ఒక కూర్గు కుటుంబంలోని పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, 20వ ఏట బెంగళూరు సెంట్రల్ కాలేజీ నుంచి బీఏ డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ప్రిన్సిపల్, అప్పటి మైసూరు రాజ్యపు దివాను రంగాచార్యుల సహాయ సహకారాలతో ప్రభుత్వ ఉపకారవేతనంపై పూనేలోని ఇంజినీరింగ్ కాలేజీలో చదివారు. అప్పటి బొంబాయి రాష్ట్రంలో పి.డబ్ల్యూడీ శాఖ అసిస్టెంట్ ఇంజనీరుగా నేరుగా నియమితులయ్యారు.
దాదాపు 70 ఏండ్లకు పైగా నిరంతరం శ్రమించి, దేశంలోని దాదాపు అన్ని ముఖ్య నగరాలకు రక్షిత మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్మూలన, వరద నివారణకు పథకాలు వీరి కృషి ఫలితంగానే పూర్తి అయ్యాయి.1918 నాటికి, దేశంలోకెల్లా అతి పెద్దదైన కృష్ణరాజుసాగరం జలాశయం కావేరీ నదిపై నిర్మించారు. ఈ ఆనకట్ట మైసూరు సంస్థానంలో లక్షలాది ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్గించి, కోలారు బంగారు గనులకు, మైసూరు, బెంగళూరు నగరాలతోబాటు, అనేక గ్రామాలకు విద్యుత్ కొరత తీర్చి, మైసూరు రాజ్యపు ఆర్థిక స్వరూపాన్నే మార్చివేసి, సమగ్రాభివృద్ధికి దోహదకారి అయి, ఆ రాజ్యానికి జీవనాడి అయింది. ఇది ఇరిగేషన్ ఇంజనీరుగా విశ్వేశ్వరయ్య సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు.
సలహాదారు ఇంజనీరుగా కనీసం 12 పథకాలకుపైగా ముఖ్యంగా ముక్కూరు, నాగపూరు, 'బిజాపూరు' నగరాలకు మంచినీటి సరఫరా పథకాలు స్వయంగా చేపట్టి పూర్తిచేశారు. పూనే, మైసూరు, హైదరాబాద్ మొదలైన నగరాలకు నవీన పద్ధతులలో డ్రైనేజీ పథకాలు వీరి సూచనల మేరకు పూర్తిచేశారు. 'ఏడెన్' నగరానికి, మూసీ నదివల్ల వరదల పాలైన హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా ఆహ్వానితులై, వారిసూచనల మేరకు నగర పునర్నిర్మాణం, మురుగునీటి పారుదల, వరద నివారణ పథకాలు పూర్తిచేశారు.
అప్పటి మైసూరు మహారాజా మైసూరు సంస్థాన సమగ్రాభివృద్ధికై చీఫ్ ఇంజనీరుగా బాధ్యత స్వీకరించిన తమ రాజ్య ప్రజలకు తమ మేధాశక్తి సత్ఫలితాలను పంచి ఇవ్వవలసిందిగా విశ్వేశ్వరయ్యను కోరారు. అందుకు విశ్వేశ్వరయ్యగారు తమ జీవితాశయాలైన పరిశ్రమల స్థాపన, విద్యాభివృద్ధి, ముఖ్యంగా సాంకేతిక విద్యావ్యాప్తి మొదలైన అన్ని కార్యక్రమాలకు మహారాజావారు సహకరించి ఆమోదముద్ర వేయవలసి ఉంటుందనే షరతులపై చీఫ్ ఇంజనీరుగా 1909లో ఆ బాధ్యత స్వీకరించారు. 102వ ఏట తుదిశ్వాస విడిచే వరకు నిస్వార్థ చింతనతో దేశానికి సేవ చేసిన ధన్యజీవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962, ఏప్రిల్ 14వ తేదిన ఆయన తనువు చాలించారు.
తెలుగు ప్రజలకు:
మన తెలుగు ప్రజలకు తరతరాలకు గుర్తుండిపోయేలా ఆయన చూపిన ప్రతిభను ప్రస్తుతం ప్రపంచంలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీల్లో పాఠాలుగా బోధిస్తున్నారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఆ సమయంలో సాగర తీరం నుండి రక్షించే వ్యవస్థను రూపొందించి ఆయన చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు కోట్లాది మంది భక్తులు ప్రయానించే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది కూడా ఆయనే.
భారతరత్న పురస్కారం:
ఈయన మైసూరు దివాన్ గా ఏడు సంవత్సరాల పాటు పని చేశారు. 1927 నుండి 1955వ సంవత్సరం వరకు స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా సేవలందించారు. ఈయన ఇంజినీరింగ్ విభాగంలో చేసిన సేవలను గుర్తిస్తూ 1955 సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు భారతరత్న పురస్కారం లభించింది. 1911లో అతను కంపేనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితుడయ్యాడు. 1915లో మైసూరు దివానుగా ఉండగా అతను ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిషు ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1955లో భారత దేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రధానం చేశారు. లండన్ లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్. యాభై సంవత్సరాల పాటు, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అతనుకు గౌరవ సభ్యత్వాన్నిచ్చాయి. భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు అతనుకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1923లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు అతను అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
విశ్వేశ్వరయ్య కృషికి గుర్తులు:
కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట
బృందావన్ గార్డెన్
భద్రావతి ఉక్కు కర్మాగారం
మైసూర్ బ్యాంక్
దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ
స్వయంచాలిత వరదనీటి గేట్లు (పూనా దగ్గర)
హైదరబాద్ కు వరద నీటి రక్షణ వ్యవస్థ
విశాఖపట్టణం రేవులో భూకోతను నివారించడం
తిరుమల, తిరుపతి మధ్య రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక
ఆసియాలోనే మొదటి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీ
శ్రీ జయాచామరాజేంద్ర పాలిటెక్నిక్ కళాశాల
బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
మైసూర్ చక్కెర మిల్లులు
సంస్థల ఏర్పాటులో ప్రముఖ పాత్ర
1908లో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత, మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థాన అభివృద్ధికి కృషి చేసాడు. క్రింద పేర్కొన్న సంస్థల ఏర్పాటులో అతను కీలక పాత్ర పోషించాడు.
మైసూరు సోప్ ఫ్యాక్టరీ.
పారాసిటాయిడ్ లేబొరేటరీ
విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, భద్రావతి
శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్
బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్
ద సెంచురీ క్లబ్
మైసూర్ చాంబర్ ఆఫ్ కామర్స్
విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
1917లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో ముఖ్యపాత్ర వహించాడు. తరువాత ఈ కాలేజికి అతను పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి. మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పటంలో కూడా అతను పాత్ర ఉంది. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాడు. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు ఏర్పాటులో కూడా అతను పాత్ర ఉంది. హైదరాబాదులోని పత్తర్‌గట్టి నిర్మాణానికి డిజైన్ ను అందించాడు.