Ram Navami 2022: రెండు సంవత్సరాల తరువాత శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచలం, ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు
ఈసందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణలోని భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు (Bhadradri all set for grand Rama Navami) జోరుగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి రోజున ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం శ్రీసీతారాముల ఉత్సవ మూర్తులను కల్యాణ మండపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు.
ఈ సందర్భంగా భక్తులకు సీతారామచంద్రస్వామిలను దర్శించుకొనే భాగ్యం కల్పిస్తారు. సాయంత్రం కల్యాణ వేడుక అంగరంగవైభవంగా జరగనుంది. కల్యాణ వేడుక ముగిశాక 11వ తేదీ సోమవారం ఉత్సవ మూర్తులను ఆలయం నుండి కల్యాణ మండలానికి మళ్లీ ఊరేగింపుగా తీసుకొస్తారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం12:30 గంటల వరకు మహాపట్టాభిషేకం కీలక ఘట్టం జరుగుతుంది. అనంతరం ఉత్సవమూర్తులను కల్యాణ మండలం నుండి ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా స్వామికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుంది.
అయితే గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో శ్రీరామనవమి వేడుకలు (Rama Navami fete after 2 years) నిర్వహించలేదు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కల్యాణ వేడుకలను భక్తులు కనులారా తిలకించే అవకాశం కలిగింది. దీంతో తెలంగాణ నుండే కాకుండా ఏపీ సరిహద్దు ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు.