శ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2022) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.అయితే ఆరోజు రాముడిని కొలవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
వివిధ రకాలుగా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. ఆ రోజు దేవుళ్ళు దేవతల విగ్రహాలను శుభ్రం చేసుకుంటారు. ఉదయాన్నే నిద్ర లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని దేవుడు మందిరం శుభ్రం చేసుకున్నాక దీపారాధన చేస్తారు. అలానే శ్రీ రామునికి పండ్లు, తులసి ఆకులని, పూలని, ప్రసాదాన్ని అర్పిస్తారు. అలానే ఆ రోజు ఉపవాసం కూడా చాలా మంది పాటిస్తారు. శ్రీ రామునికి హారతి ఇచ్చిన తర్వాత రామచరితమానస్, రామాయణం, రామస్తుతి, రామ రక్ష స్తోత్రం వంటివి చదువుతారు.
నిజంగా ఆరోజే శ్రీసీతారాములకు పెండ్లి అయ్యిందా.. లేక కేవలం పుట్టినరోజా (Birth Anniversary Of Lord Ram) ఏ విషయమై పలువురిక సందేహం. అయితే పండితులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం. శ్రీరాముడు త్రేతాయుగంలో , చైత్రమాసం, వసంత ఋతువు శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును (The Birth Anniversary Of Lord Rama) ప్రజలు పండుగగా జరుపుకొంటారు.
ఆ తర్వాత స్వామి విద్యాభ్యాసం, విశ్వామిత్ర మహర్షి కోరికతో స్వామి అరణ్యాలకు వెళ్లడం అక్కడ రాక్షసులను సంహరించడం ఆ తర్వాత జనకమహారాజు పెట్టిన శివధనస్సు పర్వంలో గెలవడం. ఆ తర్వాత సీతమ్మ తల్లిని పెండ్లిచేసుకోవడం అన్ని జరిగిపోయాయి. తర్వాత తీరా పట్టాభిషేకం చేస్తారనుకునే సమయంలో తండ్రి ఆన కోసం పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెట్టాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది అని కొందరి అభిప్రాయం. అయితే శ్రీవాల్మీకి రామాయణం ప్రకారం మార్గశిర మాస శుక్లపక్ష పంచమి నాడు రాముని పెళ్లి జరిగింది. అందుకే జనకుని రాజ్యం అదేనండి నేటి నేపాల్‌లోని జనకుర్సి ప్రాంతంలో నేటికి మార్గశిరమాసంలో రామకళ్యాణం చేస్తుంటారు. కనుక జన్మదినం, వివాహదినం & రాజ్య పునరాగమనం కూడా నవమి రోజునే జరిగిందని చాలామంది విశ్వాసం. మన తెలుగునాట నవమినాడు శ్రీసీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమినాడు చేయడం వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఆచారం, పరంపర. పెద్దలు చేసినదానిని పవిత్రంగా భావించి శ్రీ సీతారాముల అనుగ్రహం పొందడమే మన కర్తవ్యం.