Sri Rama Navami 2021: రమణీయ అంశాలకు మానవీయ రూపమే శ్రీరాముడు, నేడు శ్రీ రామ నవమి! చైత్ర శుద్ధ నవమికి ఉన్న విశిష్టత, రామనవమి చెప్పే రామ కథాసారాన్ని తెలుసుకోండి
Happy Ram Navami (Photo Credits: File Photo)

Sri Rama Navami 2021: శ్రీ రామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీ రాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఎన్నో ఆదర్శలకు, విలువలకు, ధర్మాలకు మానవీయ రూపమైన రాముడి జన్మదినాన్నే రామ నవమిగా , ఒక పండుగగా ప్రజలు జరుపుకుంటారు. అలాగే 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. అందుకే ఈ చైత్ర శుద్ధ నవమి అయిన ఈరోజుకి ఇంతటి విశిష్టత. శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఏడాది తెలంగాణాలోని భద్రాద్రిలో శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా గతేడాదిలాగే ఈ ఏడాది కూడా శ్రీ సీతారామ కళ్యాణోత్సవ వేడుకలను భక్తులు లేకుండానే నిరాడంబరంగా నిర్వహించనున్నారు.

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్లు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముడిని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడు.

చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "అమోన్ రా" లేదా "రా" అనేవారు. లాటిన్ భాషలో కూడా "రా" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. తెలుగులో కూడా సూర్యుడిని 'రవి' అనే పేరుతో పిలుస్తారు. అందుకే రామనవమి రోజున ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. రామ నవమిలో ప్రత్యేకించి భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు శ్రీరాముడిని, రామరాజ్యాన్ని కీర్తిస్తూ భజనలతో రథ యాత్ర కొనసాగిస్తారు. చైత్ర శుద్ధ నవమి పర్వదినాన శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవిస్తే మనిషిలోని దుర్గుణాలు ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి, జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుందట. అందుకే భక్త రామ దాసు  శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు.

ఎక్కడైతే ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అదే రామరాజ్యమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్య్రానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. అందుకే భారత దేశంలో ఒక వ్యక్తిని కీర్తించాలన్నా, ఒక గొప్ప రాజ్యాన్ని ఉదాహారణగా చెప్పాలన్నా రాముడు.. రామ రాజ్యమే అందుకు ప్రతీక.

మన పాలకులు రాముని అడుగుజాడల్లో నడవాలని, ప్రజలు రాముడి ఆదర్శాలను పాటించాలని ఆకాంక్షిస్తూ 'లేటెస్ట్‌లీ తెలుగు' తరఫున అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.