Swami Vivekananda Jayanti: మీరు భగవంతుని చూశారా, స్వామి వివేకానంద ప్రశ్నకు గురువు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, హిందూ మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లిన హిందూ యోగి గురించి ప్రత్యేక కథనం
స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
Swami Vivekananda Quotes: స్వామి వివేకానంద, ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
స్వామి వివేకానంద ఒక హిందూ సన్యాసి. అతను కేవలం ఆధ్యాత్మిక మనస్సు కంటే ఎక్కువ; అతను ఫలవంతమైన ఆలోచనాపరుడు, గొప్ప వక్త, ఉద్వేగభరితమైన దేశభక్తుడు. అతను తన గురువైన రామకృష్ణ పరమహంస యొక్క స్వేచ్ఛా-ఆలోచనా తత్వాన్ని కొత్త ఉదాహరణగా ముందుకు తీసుకెళ్లాడు.అతను పేదల సేవలో, తన సర్వస్వాన్ని తన దేశం కోసం అంకితం చేస్తూ, సమాజ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేశాడు.ప్రపంచ వేదికపై హిందూ మతాన్ని గౌరవనీయమైన మతంగా స్థాపించాడు.అతని మాటలు దేశంలోని యువతకు స్వీయ-అభివృద్ధి లక్ష్యాలుగా మారాయి. అందుకే ఆయన జన్మదినమైన జనవరి 12ని భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
కలకత్తాలోని ఒక సంపన్న బెంగాలీ కుటుంబంలో జనవరి 12, 1863న మకర సంక్రాంతి సందర్భంగా నరేంద్రనాథ్ దత్తా జన్మించారు, విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దేవి దంపతుల ఎనిమిది మంది పిల్లలలో వివేకానంద ఒకరు.తండ్రి విశ్వనాథ్ న్యాయవాది. నరేంద్రుడు ఆటలలోనూ, చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంథాగ్రాహి. పాఠాన్ని ఒకసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపకశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రిక్యులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకూ అతని జ్ఞాన తృష్ణ అధికంకాసాగింది.
దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్సు తోపాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగినాయి. అలా మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలలో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందునా వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.
అతను కొంతకాలం కేశబ్ చంద్ర సేన్ నేతృత్వంలోని బ్రహ్మో ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడు. బ్రహ్మో సమాజం విగ్రహారాధన, మూఢనమ్మకాలతో నిండిన హిందూ మతం వలె కాకుండా ఒక దేవుడిని గుర్తించింది. అతని మనస్సులో దేవుని ఉనికికి సంబంధించిన తాత్విక ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ ఆధ్యాత్మిక సంక్షోభం సమయంలో, వివేకానంద స్కాటిష్ చర్చి కళాశాల ప్రిన్సిపాల్ విలియం హస్టీ నుండి శ్రీరామకృష్ణుని గురించి మొదట విన్నాడు.
అంతకుముందు, భగవంతుని కోసం తన మేధో తపనను సంతృప్తి పరచడానికి, నరేంద్రనాథ్ అన్ని మతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక నాయకులను సందర్శించి, “మీరు దేవుడిని చూశారా?” అని ఒకే ప్రశ్న అడిగారు. ప్రతిసారీ తృప్తికరమైన సమాధానం లేకుండానే బయటికి వచ్చాడు. దక్షిణవార్ కాళీ టెంపుల్ కాంపౌండ్స్‌లోని తన నివాసంలో శ్రీరామకృష్ణను ఆయన ముందుంచారు. అక్కడ కూడా మీరు భగవంతుని చూశారా? అని ప్రశ్నించాడు.
ఒక్క క్షణం కూడా సంకోచించకుండా, శ్రీరామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు. అవును చూశాను నేను నిన్ను చూసిన విధంగానే, ఆయనతో మాట్లాడాను కూడా, అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తపించిపోతున్నారు? అన్నాడాయన. ఇప్పటి దాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు, కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం?, ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు. కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరుచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు.
ఒక నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్ కు వెళ్ళాడు. రామకృష్ణులవారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనికేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచేకొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు.
నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణులవారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికా దేవి అతనిని మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించేవరకూ గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతనికి ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను. నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవీ అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణులవారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు.
సన్యాసం వైపు అడుగులు..
నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బి.ఎ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బి.ఎలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది పిడుగు లాంటి వార్త. తండ్రి మరణించాడని. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.
నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొకపూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలారోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టేవాడు. వారితో తను స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెన్నాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికా దేవికి, సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివ, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు.
తరువాత నరేంద్రుడు కొద్దిరోజులపాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. 1885 మధ్యలో, గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న గురువు రామకృష్ణ ఆరోగ్యం క్షీణించింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండు మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణులవారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున అతను నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేన్! నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలవంటి వారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు.
రామకృష్ణులవారు చనిపోయిన తరువాత అతను శిష్యులందరూ కలిసి బరనగూర్‌లో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణగొణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడి నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువసన్యాసులకు రెండే లక్ష్యాలు ఉండేవి. ప్రజలకు సేవ చేయడం, ముక్తిని సాధించడం. కొద్ది మంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులు గా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి, బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నపుడు కూడా తమ చదువును, ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శకులకి గురువుగారి బోధనలను విడమరిచి చెప్పేవాడు.
నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారాడు. భారతదేశం అతని గృహమైంది. ఇక్కడి ప్రజలు అతని సోదర, సోదరీమణులయ్యారు. దురదృష్టవంతులైన తన సోదరుల కన్నీళ్ళు తుడవడం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించే పని. దేశమంతా పర్యటించాడు. తనకున్న ఆస్తి అంతా ఒక కాషాయ వస్త్రము, ఒక కమండలం, శిష్యగణం మాత్రమే. ఈ పర్యటనలో అతను ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. దారి మధ్యలో గుడిసెల్లోనూ, సత్రాలలోనూ నివసించేవాడు, కటిక నేలమీదనే నిద్రించేవాడు. అనేక మంది సాధువుల సాంగత్యంలో గడిపాడు. ఆధ్యాత్మిక చర్చలతో, పవిత్ర కార్యాల గురించిన చర్చలతో సమయం గడిపేవాడు. చాలా దూరం కాలినడకనే నడిచేవాడు. ఎవరైనా దయ తలిస్తే ఏదైనా వాహనంలో ఎక్కేవాడు. ఆళ్వార్ దగ్గర కొద్ది మంది ముస్లింలు కూడా అతనుకు శిష్యులయారు. ఎవరైనా రైలు ప్రయాణానికి టిక్కెట్టు కొనిస్తేనే రైలులో ప్రయాణం చేసేవాడు. చాలాసార్లు తన దగ్గర డబ్బులేక పస్తుండాల్సి వచ్చేది.
మైసూరులో స్వామికి దివాను శేషాద్రి అయ్యర్ , మైసూరు మహారాజా వారితో పరిచయం ఏర్పడింది. పండితుల సభలో స్వామీజీ సంస్కృతం లో చేసిన ప్రసంగం మహారాజా వారిని ముగ్ధుల్ని చేసింది. భారతదేశం వివిధ మతాల, వివిధ తత్వాల సమ్మేళనం. పాశ్చాత్యులు విజ్ఞానశాస్త్రంలో మంచి పురోగతి సాధించారు. ఈ రెండు కలిస్తే మానవజాతి మంచి పురోగతిని సాధించగలదు. కాబట్టి నేను అమెరికా వెళ్ళి అక్కడ వేదాంతాన్ని వ్యాప్తి చెయ్యాలనుకుంటున్నాను అని స్వామీజీ మైసూరు మహారాజాతో అన్నాడు. అయితే ఆ ఖర్చులన్నీ నేనే భరిస్తానన్నాడు మాహారాజా. స్వామీజీ అతనుకు కృతజ్ఞతలు తెలిపి సమయం వచ్చినపుడు తప్పకుండా అతను సహాయం తీసుకుంటానని చెప్పి సెలవు తీసుకున్నాడు.
కన్యాకుమారిలో వివేకానంద స్మారక భవనం
తరువాత స్వామీజీ భాస్కర సేతుపతి పరిపాలిస్తున్న రామనాడును సందర్శించాడు. అక్కడి రాజు స్వామీజీని మిక్కిలి గౌరవించాడు. మీరు అమెరికాలో జరగబోవు సర్వ మత సమ్మేళనానికి తప్పకుండా హాజరవాలి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను అన్నాడు. దానిని గురించి తప్పకుండా ఆలోచిస్తానని అతనుకు మాట ఇచ్చి అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్ళి చివరకు కన్యాకుమారి చేరుకున్నాడు. కొద్ది దూరం ఈదుకుంటూ వెళ్ళి ఒక రాయి మీద కూర్చున్నాడు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశపు ఆధ్యాత్మిక విలువల్ని వారికి వివరించడం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నిదురపోతున్న భారతజాతిని మేల్కొలపాలనుకున్నాడు. అతని ప్రయాణానికి ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచీ విరాళాలు వచ్చి పడ్డాయి. కానీ అతడు మాత్రం తన ప్రయాణానికి ఎంత కావాలో అంతే స్వీకరించాడు. మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చివేశాడు.
తన సంచరిస్తున్న సమయంలో, అతను 1893లో అమెరికాలోని చికాగోలో ప్రపంచ మతాల పార్లమెంట్‌ను నిర్వహించడం గురించి తెలుసుకున్నాడు. భారతదేశం, హిందూమతం, తన గురువైన శ్రీరామకృష్ణుని తత్వాలకు ప్రాతినిధ్యం వహించడానికి, సమావేశానికి హాజరు కావడానికి అతను ఆసక్తిగా ఉన్నాడు. అయితే డబ్బులు ఇబ్బందిపెట్టాయి. అతని శిష్యులు డబ్బు సేకరించారు. ఈ డబ్బుతో అజిత్ సింగ్, ఖేత్రీ రాజా, వివేకానంద మే 31, 1893న బొంబాయి నుండి చికాగోకు బయలుదేరారు.అతను చికాగోకు వెళ్లే మార్గంలో అధిగమించలేని కష్టాలను ఎదుర్కొన్నాడు. చికాగోలో అతను వేదికపైకి వచ్చి “మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా” అనే తన ప్రారంభ పంక్తితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రారంభ వాక్యానికి ప్రేక్షకుల నుండి స్టాండింగ్ ఒవేషన్ అందుకున్నాడు. అతను వేదాంత సూత్రాలను, వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించాడు, ప్రపంచ మతాల పటంలో హిందూ మతాన్ని ఉంచాడు.అతను తరువాతి రెండున్నర సంవత్సరాలు అమెరికాలో గడిపాడు. 1894లో న్యూయార్క్ యొక్క వేదాంత సొసైటీని స్థాపించాడు. అతను పాశ్చాత్య ప్రపంచానికి వేదాంత, హిందూ ఆధ్యాత్మికత సిద్ధాంతాలను బోధించడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు కూడా వెళ్ళాడు.
వివేకానంద 1897లో భారతదేశానికి తిరిగి వచ్చారు. అతను దేశవ్యాప్తంగా అనేక ఉపన్యాసాల తర్వాత కలకత్తా చేరుకున్నాడు. మే 1, 1897న కలకత్తా సమీపంలోని బేలూరు మఠంలో రామకృష్ణ మిషన్‌ను స్థాపించాడు. రామకృష్ణ మిషన్ యొక్క లక్ష్యాలు కర్మ యోగా యొక్క ఆదర్శాలపై ఆధారపడి ఉన్నాయి. దాని ప్రాథమిక లక్ష్యం.. దేశంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయడం. రామకృష్ణ మిషన్ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులను స్థాపించడం, నిర్వహించడం, సదస్సులు, సెమినార్లు, వర్క్‌షాప్‌ల ద్వారా వేదాంత ఆచరణాత్మక సిద్ధాంతాలను ప్రచారం చేయడం, దేశవ్యాప్తంగా సహాయ, పునరావాస కార్యక్రమాలను ప్రారంభించడం వంటి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టింది.స్వామి వివేకానంద ఒక ప్రముఖ జాతీయవాది. అతని మనస్సులో తన దేశప్రజల మొత్తం సంక్షేమమే ప్రధానం. “లేవండి, మేల్కొలపండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి” అని వివేకానంద తన తోటి దేశ ప్రజలను కోరారు.
వివేకానంద మరణం
అవిశ్రాంతంగా పని చేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని అతని శిష్యుల అభ్యర్థన మేరకు మరల అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్ లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రానూ రానూ అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది కానీ అతను ఆత్మ, మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జులై 4, 1902న యథావిధిగా అతను రోజూవారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తరువాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత అతనికి చిన్న వణుకు లాంటిదేదో కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ, శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో అతను అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరిచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లితండ్రులను కోల్పోయిన అనాథలవలే దుఃఖించారు. అతను ‘మహాసమాధి’ పొందాడని, గంగా నది ఒడ్డున గొప్ప సాధువు దహన సంస్కారాలు నిర్వహించారని చెబుతారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)