Sri Sita Ramula Kalyanam: భద్రాద్రిలో రాములోరి కళ్యాణోత్సవం. నిరాడంబరంలోనే రమణీయంగా, కమనీయంగా సాగిన వేడుక, తొలిసారిగా భక్తులు లేకుండానే జరిగిన బ్రహ్మోత్సవం
లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా భక్తజనం లేకుండానే రాములోరి బ్రహ్మోత్సవం నిర్వహించారు......
Bhadrachalam, April 2: శ్రీ రామ నవమిని (Sri Ram Navami 2020) పురస్కరించుకొని భద్రాద్రి దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం (Sri Sita Ramula Kalyanam) గురువారం అత్యంత కన్నుల పండువగా జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో తొలిసారిగా భక్తజనం లేకుండానే రాములోరి బ్రహ్మోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో కేవలం కొద్ది మంది అర్చకుల సమక్షంలోనే శాస్త్రోక్తంగా ఘనంగా కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకకు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ చారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ ఎం.వి. రెడ్డి, ఆలయ ఈవో నర్సింహులు తదితరులు హాజరయ్యారు. కేవలం 40 మంది సమక్షంలోనే జగత్కళ్యాణం (The celestial wedding) ఈరోజు జరిగింది.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు భద్రాద్రి శ్రీ సీతారామ స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఈ వేడుక జరిగింది కొద్ది మంది సమక్షంలోనైనా అత్యంత రమణీయంగా సాగింది. ఈ ఏడాది శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని లక్షలాది మంది భక్తజనం టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి, తరించారు.
దేశవ్యాప్తంగా శ్రీ రామ నవమి వేడుకలు భక్తులెవ్వరూ పాల్గొననప్పటికీ ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో గల ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా, అధికారిక లాంఛనాలతో ప్రారంభమైనాయి. ఆలయ అధికారులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల సమక్షంలో ఉత్సవాలకు అంకురార్పన జరిగింది. రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి ఏపీ ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేదపండితులు ధ్వజారోహణం నిర్వహించారు.