Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు.. నెల రోజుల్లో బాల రామయ్యను దర్శించుకున్న 63 లక్షల మంది భక్తులు
జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది.
Ayodhya, Feb 25: అయోధ్యలోని రామమందిరంలో (Ayodhya Ram Mandir) రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది. భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడిని (Ram Lalla) దర్శించుకుంటున్నారు. కానుకలు, విరాళాలను కూడా పెద్ద మొత్తం సమర్పించుకుంటున్నారు. మొదటి నెల రోజు ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది. తొలి నెలలో రూ.25 కోట్ల విలువైన విరాళాలు అందాయని తెలిపింది. 25 కిలోల బంగారం (Gold), వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీలు, నగదు రూపంలో విరాళాలు వచ్చాయని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో 60 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
బంగారం, వెండి వస్తువులు ప్రభుత్వానికి అప్పగింత..
రామ్ లల్లాకు బహుమతులుగా అందిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కరిగించి నిర్వహణ కోసం భారత ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రామాలయ ట్రస్ట్ వెల్లడించింది.