Huge Rush at Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 71,615గా ఉండగా.. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లుగా తేలింది.
జూన్ 30 నుంచి కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఇందులో భాగంగా జూన్ 30న మొదటిరోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారని ఆలయ అధికారులు వివరించారు. జూలై 1న ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం, జూలై 2న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారన్నారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తామని చెప్పారు.